సాక్షి, సంగారెడ్డి: జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ) ఎన్నిక ఈనెల 17న జరగనుంది. ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయటంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ ఎన్నిక ముగియగానే జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు ఇతరాత్ర సమస్యల వల్ల ప్రణాళిక కమిటీ ఎన్నికల నిర్వహణలో కొంత జాప్యం జరిగింది.
ప్రస్తుతం సర్కార్ జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను అనుసరించి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల పేర్లతో ఓటరు జాబితాను సైతం జెడ్పీ అధికారులు వెలువరించారు. ఈ ఓటరు జాబితాపై బుధవారం అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది ఓటరు జాబితాను గురువారం ప్రకటిస్తారు.
ఎన్నికలు...ఆ వెంటనే ఫలితాలు
12వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీలోని 4 అర్బన్, 20 గ్రామీణ సభ్యుల స్థానాల ఎన్నికకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 17వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెలువరిస్తారు.
జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రణాళిక కమిటీ ఎన్నికల విషయమై రెండు పార్టీల జెడ్పీటీసీలు త్వరలో సమావేశమై ప్రణాళిక కమిటీ సభ్యుల స్థానాలకు ఎవరిని బరిలో దించాలో నిర్ణయించే అవకాశం ఉంది. కాగా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ డీపీసీ ఎన్నికల్లో సైతం పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.
డీపీసీ సభ్యుల ఎన్నిక ఇలా...
జిల్లా ప్రణాళిక కమిటీలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు మరో 28 మంది సభ్యులు ఉంటారు. జెడ్పీ చైర్‌పర్సన్ డీపీసీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ ఉంటారు. 28 మంది సభ్యుల్లో నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగితా 24 మంది సభ్యుల్లో నలుగురు అర్బన్, 20 మంది రూరల్ సభ్యులు ఉంటారు. నలుగురు అర్బన్ సభ్యులుగా మున్సిపల్ కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. 20 మంది రూరల్ సభ్యులను జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు.
జిల్లాలో ప్రస్తుతం సంగారె డ్డి, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, గజ్వేల్, అందోలు మున్సిపాలిటీల్లో మొత్తం 145 మంది కౌన్సిలర్లు ఉన్నారు. డీపీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుసరించి కౌన్సిలర్లు పోటీ చేయవచ్చు. ఒక్కో కౌన్సిలర్లు ఎన్నికల్లో నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రూరల్ సభ్యుల రిజర్వేషన్ ప్రకారం జెడ్పీటీసీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక్కో జెడ్పీటీసీ 20 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 17న సంగారెడ్డిలో జరగనున్న డీపీసీ ఎన్నికలకు కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
టీఆర్‌ఎస్‌కే ఎక్కువ అవ కాశాలు
డీపీసీ ఎన్నికల్లో 24 మంది సభ్యుల ఎన్నికల కీలకం కానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ, జెడ్పీలోనూ అధికారపార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో డీపీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జెడ్పీలో 46 స్థానాలకుగాను 21 మంది టీఆర్‌ఎస్ సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన మరో ఐదుగురు సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నారు. అలాగే టీ డీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు సైతం జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో టీఆర్‌ఎస్ సహకరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే డీపీసీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డీపీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
17న డీపీసీ ఎన్నిక
Published Tue, Dec 9 2014 11:22 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement