సూర్యాపేటరూరల్ : వారిద్దరూ తోటి కోడళ్లు. కానీ సర్పంచ్ పదవి కోసం ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. సూర్యాపేట మండలం ఆరెగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు అన్నదమ్ముల సతీమణులు పోటీలో నిలవడంతో ఆ గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆరెగూడెం గ్రామపంచాయతీ ఆవాసం పుల్గంవారిగూడెంకు చెందిన పుల్గం చిన లింగా రెడ్డి, సుగుణమ్మ పెద్ద కుమారుడైన పుల్గం వెంకటరెడ్డి, చిన్న కుమారుడైన పుల్గం రాఘవరెడ్డి తమ సతీమణులను సర్పంచ్ బరిలో నిలిపారు. ఆరెగూడెం గ్రామపంచాయతీ జనరల్ మహిళ కావడంతో తమకు రిజర్వేషన్ కలిసి రాలేదని వారు తమ భా ర్యలను సర్పంచ్ పోటీకి దించారు. ఇంటికి పెద్ద వాడైన పుల్గం వెంకటరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య సుజాతను పోటీలో నిలపగా ఆయన తమ్ముడు పుల్గం రాఘవరెడ్డి కూడా తన భార్య స్వాతిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంచారు. అన్నదమ్ముల భార్యలు సర్పం చ్ బరిలో ఉండడంతో ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే ఆలోచనలోపడ్డారు.
226 ఓట్లకుపైగా వస్తే గెలుపు
బాలెంల గ్రామ ఆవాసమైన ఆరెగూడెంను ఇటీవల ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేసింది. పుల్గంవారిగూడెం, ఆరెగూడెం గ్రామాలను కలిపి ఆరెగూడెం గ్రామపంచాయతీగా చేసింది. ఈ గ్రామంలో 549 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఓట్లు ఉండడం, పోటీలో ఉన్న వారు ఇద్దరూ తోటి కోడళ్లు కావడం విశేషం. 226 ఓట్ల పైచిలుకు ఎవరికి వస్తే వారిదే గెలుపు తధ్యం. ఇప్పటికే ముమ్మరంగా ఇరువురు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment