మూతపడిన పరిశ్రమలు తెరిపించండి
వేతనాల్లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ తుంగలో తొక్కిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. మంగళవారం కాచిగూడలోని టూరిస్ట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణను తెస్తామన్న నాయకులు, గత మూడేళ్లుగా నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్, ఏపీ రేయాన్స్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టీరీలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలన్నారు. ఏళ్ల తరబడి వేతనాలు అందకపోతుండడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌ను కోరానన్నారు.
రాష్ట్రంలో యువతకు కొత్త ఉద్యోగాలు రావాలే గానీ, ఉన్న ఉద్యోగాలు పోకూడదన్నారు. అదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్మికుల విజ్ఞప్తి మేరకు, ఫ్యాక్టరీని తెరిపించే విషయమై తాను ఇప్పటికే కేంద్ర రవాణ శాఖ మంత్రితో చర్చించానన్నారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు అయ్యే వ్యయం, వేతనాల ఖర్చు.. తదితర అంశాలపై త్వరలోనే పలు శాఖల ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగరేణి ఎన్నికల విషయంలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులను పిలిపించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
బీజేపీకి అనుకూల వాతావరణం...
ఈ నెల 6 నుంచి 11 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీని పటిష్ట పరిచేందుకు జెండా ఆవిష్కరణలతో పాటు ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిపై విశేష ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, అధికార ప్రతినిధి పుష్పలీల పాల్గొన్నారు.