కేంద్రమంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరం: టీఆర్‌ఎస్
హైదరాబాద్: కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. దత్తాత్రేయ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాహం వేసినపుడే బావి తవ్వుకుందామనే రీతిలో బీజేపీ వైఖరి ఉందన్నారు.
దత్తాత్రేయ లాంటి పెద్ద మనిషి కూడా అబద్దాలాడుతుండటం శోచనీయమని మిర్చి రైతుల విషయంలో చాలా ఆలస్యంగా స్పష్టత లేని విధంగా కేంద్రం స్పందించిందని దుయ్యబట్టారు. మిర్చి సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయి చేసే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు. కాషాయ జెండాను విస్తరించుకునే క్రమంలోనే బీజేపీ నేతలు రైతులను రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. బ్యాంకులను వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా మీద ఉన్న ప్రేమ రైతుల మీద కేంద్రానికి లేక పోవడం విచారకరమన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉండి సహచర మంత్రి రాధామోహన్ సింగ్, ప్రధాని మోదీలతో మాట్లాడి తెలంగాణా రైతుల కు న్యాయం చేయాలని దత్తాత్రేయ భావించడం లేదని ప్రభాకర్ మండి పడ్డారు.