ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కు
♦ రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం: కిషన్ రెడ్డి
♦ హైదరాబాద్‌ను పంచుకుంటున్న ఒవైసీ, కేసీఆర్ కుటుంబాలు
♦ టీఆర్‌ఎస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇవ్వడానికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తున్నదన్నారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ కలసి పనిచేస్తున్నాయని తాము చెబుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. టీఆర్‌ఎస్, మజ్లిస్ హైదరాబాద్‌ను పంచుకున్నాయన్నారు.
ఒవైసీ సోదరులు పాతబస్తీని, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవిత కొత్త పట్నాన్ని పంచుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో సంబంధం లేదని, మతతత్వ పార్టీ అని ఇప్పటిదాకా మాట్లాడిన కేసీఆర్ కుటుంబసభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధికోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంఐఎంకి టీఆర్‌ఎస్ తాకట్టు పెట్టిందని విమర్శించారు. మతోన్మాద పార్టీ, రజాకార్ల వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం మతోన్మాదాన్ని టీఆర్‌ఎస్ సమర్థిస్తుందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఉగ్రవాదులకు అండగా ఉన్న మజ్లిస్‌పార్టీకి టీఆర్‌ఎస్ ఎలా మద్దతిస్తుందని, ఈ ఎన్నికల్లో ఎలా కలసి పనిచేస్తున్నదని అడిగారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ పన్నుల భారం పెంచుతారని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలపై అన్ని పన్నులను పెంచి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మొన్న వందసీట్లు గెలుస్తామని కేటీఆర్ అంటే కేసీఆర్ ఇప్పుడేమో 60 సీట్లు గెలుస్తామని చెప్పారని వివరించారు. రేపు 20 సీట్లే గెలుస్తామని చెప్పినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అలాంటి పార్టీకి చెందిన నేతల సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎంలను ఓడించండి
ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ఉగ్రవాదులకు అండగా ఉన్న ఎంఐఎంతో టీఆర్‌ఎస్ కలసి పనిచేస్తున్నదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం గెలిస్తే శాంతిభద్రతలకు ప్రమాదమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలను ఓడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ఇప్పటిదాకా రూ. 6,630 కోట్లను హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిందని వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా చేయడానికి కేంద్రం ప్రతిపాదిస్తే కేసీఆర్ అడ్డుకుని కరీంనగర్‌ను చేయాలని ప్రతిపాదించినట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్న కేసీఆర్‌కు హైదరాబాద్‌లో ఓట్లడిగే అర్హత లేదన్నారు.