సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీకి భయపడే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారని, తీసేస్తామని అనుకున్న మంత్రులను కూడా తీయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
హైకోర్టు మొట్టికాయ వేసినా కేసీఆర్‌కు బుద్ది రాలేదని మండిపడ్డారు. మజ్లిస్ దాయ దక్షిణ్యాల మీద టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, బంగారు తెలంగాణను కేసీఆర్ బూడిద తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ ఆరోపించారు. కారు.. సారు.. బారు.. ఇది రజాకార్ల సర్కారు అని ఎద్దేవా లక్ష్మణ్ చేశారు. అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం అధికారం అనుభవిస్తోందని, ఈ కుటుంబం నుంచి రాష్టానికి విముక్తి కావాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ సూచించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, రాష్ట్రంలో పరోక్షంగా ఎంఐఎం పార్టీనే పాలిస్తుందని ఆరోపించారు. నిజాం అడుగు జాడల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని, రజాకార్ల వారసత్వమే మజ్లిస్‌దని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ విమోచన దినోత్సవ వేడుకలే ఆరంభమని కిషన్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని, కేంద్ర పథకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహాకారం అందిచడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేసినా టీఆర్‌ఎస్ పునాదులు కదలడం ఖాయమన్నారు. రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేయాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు,శ్రేణులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు
Comments
Please login to add a commentAdd a comment