సాక్షి, న్యూఢిల్లీ: పచ్చి మతోన్మాద మజ్లిస్ పార్టీతో స్నేహం చేస్తూ ఏ రకంగా తమది సెక్యులర్ పక్షమో సీఎం కేసీఆర్ చెప్పాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మజ్లిస్ తమ మిత్రపక్షం అని, తమది సెక్యులర్ పక్షం అన్నారని గుర్తు చేశారు. తమకు 15 నిమిషాలు సమయం ఇస్తే దేశంలో 100 కోట్ల హిందువుల సంగతి చూస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ ఎలా సెక్యులర్ పార్టీ అయ్యిందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పాత బస్తీలో అల్లర్లకు కారణమైన మజ్లిస్‌తో కేసీఆర్ ఎలా అంటకాగుతున్నారని నిలదీశారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని, కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటేసినట్లేనన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం అంటే మజ్లిస్‌కు జై కొట్టినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పైకి తిట్టుకుంటూ కనిపిస్తున్నా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయకారి అవగాహన ఉందన్నారు. రెండు పారీ్టల మధ్య మజ్లిస్ సమన్వయం చేస్తోందని, అనుసంధానకర్తగా పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఈ మూడు పార్టీల నాటకాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, వారి మాటలకు మోసపోవద్దని సూచించారు.
ఆ మూడు పార్టీలు ఒకే లైన్‌లోనే..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే లైన్‌లో మాట్లాడుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోవాలని, తద్వారా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలన్న కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో సంకీర్ణం వస్తుందని... అందులో బీఆర్‌ఎస్ చేరుతుందని అనడం ద్వారా ఆ రెండు పారీ్టలు ఒకటే అని చెప్పకనే చెప్పారని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పారీ్టలు కలిసి చేస్తున్న ధర్నాలు, ఒకరికి ఒకరు చేసుకుంటున్న సహాయం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు.
గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు దగ్గరి సంబంధాలు
కాంగ్రెస్ పార్టీ తరుపున 2014లో 22 మంది గెలిస్తే 15 మంది, 2019లో 19 గెలిస్తే 12 మంది వెళ్లి బీఆర్‌ఎస్‌లో కలిశారని.. కనీసం రాజీనామా కూడా చేయకుండా మంత్రులుగా కొనసాగుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని.. గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని స్పష్టమైందని కేంద్రమంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎం కేసీఆర్‌కు 40కి పైగా లేఖలు రాస్తే, ఏ ఒక్కదానిపై కూడా స్పందించలేదని, అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గు చేటని కిషన్‌రెడ్డి అన్నారు.
రాహుల్‌వి దుందుడుకు మాటలు
మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ రాహుల్‌గాంధీ అవగాహన లేని దుందుడుకు మాటలు మాట్లాడారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ భారత్‌ను అగౌరవపరిచే విధంగా, అస్థిరపరిచే విధంగా మాట్లాడటాన్ని దేశ ప్రజలు క్షమించరన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు భారతమాతను ఎవరూ హత్య చేయలేరని.. రాహుల్ మాటలను దేశ ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. విమర్శ రాజకీయంగా ఉండాలే తప్ప ఇలా దేశాన్ని అగౌరవ పరిచేలా మాట్లాడడం తగదని రాహుల్‌గాం«దీకి కిషన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment