కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తోంది. మహాపర్వం ప్రారంభం కావడానికి 47 రోజులు మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ కొన్ని శాఖల్లో పుష్కర పనులు ప్రహసనంగా మారాయి.
కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తోంది. మహాపర్వం ప్రారంభం కావడానికి 47 రోజులు మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ కొన్ని శాఖల్లో పుష్కర పనులు ప్రహసనంగా మారాయి. ఇప్పటివరకు ఏ ఒక్క శాఖలోనూ 50శాతం పనులైనా పూర్తికాలే దు. జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 1,117 పనులు చేపట్టేందుకు రూ.478.40 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 262 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. మరో 262 పనులు నేటికీ ప్రారంభం కాలేదు. జాప్యానికి అసలు కారణాలేమిటనే విషయాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నీటిపారుదల, పురపాలక శాఖలు పుష్కర పనులకు ఇంజినీరింగ్ సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించుకోవడంతో ఆ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది.
దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు అదనపు సిబ్బంది నియామకం విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆ శాఖల్లో పనుల పురోగతి అంతమాత్రంగానే ఉంది. చాలా శాఖల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఒకే కాంట్రాక్టర్ వివిధ పనులు చేపట్టడం.. నేటికీ కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోడం.. ఇప్పటికప్పుడు కొత్తగా పనులు మంజూరు చేయడం.. వేసవి ప్రభావం తదితర కారణాల వల్ల ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు.
వర్షాలొస్తే అంతేసంగతులు
జిల్లాకు మంజూరైన 1,117 పనుల్లో 1,054 పనులకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. 747 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రుతుపవనాలు ఈనెలాఖరు నాటికి రాష్ట్రాన్ని చేరుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పుష్కర పనులకు ఆటంకం ఏర్పడుతుంది. 24 గంటలూ పనులు చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పంచాయతీరాజ్‌లో అంతంతే
పంచాయతీరాజ్ శాఖ ద్వారా మొదటివిడతగా రూ.20.08 కోట్ల విలువైన 30 పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికి వరకు 4 మాత్రమే పూర్తిచేశారు. మిగతా 26 పనులు పురోగతిలో ఉన్నాయి. రెండోవిడతలో 248 పనులు మంజూరు కాగా, 37 పూర్తయ్యాయి. 143 పనులు పురోగతిలో ఉండగా, మరో 40 పనుల టెండర్లు ఒప్పంద స్థాయిలో, 18 పనులు టెండర్లు పూర్తయిన దశలో ఉన్నాయి. మరో 4 పనులకు తిరిగి టెండర్లు పిలిచారు. మూడుచోట్ల ప్రత్యామ్నాయ పనులకు సిఫార్సు చేయగా, మరో 3 పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
టెండర్ల దశలోనే..
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 152 పనులు మంజూరయ్యాయి. వీటిలో 137 పనులు ప్రారంభించారు. 46 పూర్తికాగా, 62 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రెండు పనుల టెండర్లు ఈఎన్‌సీ పరిధిలో ఉండగా, 14 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. 12 పనుల టెండర్ల స్వీకరణకు 23వ తేదీతో, రెండు పనులకు 27వ తేదీతో గడువు పూర్తయ్యింది. ఈ పనులు ప్రారంభించడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
పురోగతిలో స్నానఘట్టాల నిర్మాణం
జిల్లాకు 96 స్నానఘట్టాలు మంజూరు కాగా, 94 పనులు ప్రారంభమయ్యాయి. 45 స్నానఘట్టాలు పూర్తయ్యాయి. మరో 20 పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మిగతా పనులను జూన్ 15నాటికి పూర్తి చేస్తామంటున్నారు. అవసరం లేని 6 పనులను రద్దు చేశారు. ఇటీవల మంజూరైన చిడిపి, ఔరంగబాద్, బ్రిడ్జిపేట స్నానఘట్టాల పనులకు ఈనెల 21న టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. గోదావరిలో గ్రోయిన్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
మందకొడిగా దేవాదాయ శాఖ పనులు
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 211 పనులకు గాను ఇప్పటివరకు 33 పూర్తిచేశారు. ఈ పనులు 3 విడతలుగా మంజూరయ్యాయి. మొదటివిడత పనుల పురోగతి బాగానే ఉంది. రెండు, మూడువిడతల్లో మంజూరైన పనుల్లో ఎక్కువ శాతం ఆలయాలకు రంగు వేయడం, ఫ్లోరింగ్, చిన్నపాటి మరమ్మతు పనులు ఉన్నాయి. తాళ్లపూడిలో మదనగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తికాలేదు.
మునిసిపాలిటీల్లో సా..గుతున్నాయ్
కొవ్వూరు పురపాలక సంఘంలో 138 పనులకు గాను ఈనెల 24నాటికి 41 పనులు పూర్తిచేశారు. నిడదవోలులో 15 పనులకు గాను 3 పూర్తయ్యాయి. పాలకొల్లులో 38 పనులకు గాను ఒకటి మాత్రమే పూర్తయ్యింది. 22 పురోగతిలో ఉన్నాయి. నరసాపురంలో 179 పనులకు గాను 52 పూర్తి చేశారు. మరో 110 పురోగతిలో ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామని, కొవ్వూరులో వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయిస్తామని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.