
ఐకేపీ సిబ్బంది జీతాల పెంపు!
ప్రతిపాదనలు పంపాలని పీఆర్ కమిషనర్‌ను ఆదేశించిన సీఎం
సాక్షి, హైదరాబాద్ : ఐకేపీ సిబ్బందికి ఇచ్చే నెలసరి జీతాన్ని (రెమ్యూనరేషన్) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రితో చర్చించి రెమ్యూనరేషన్ పెంపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నిరుపేద నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలో దాదాపు 4,264 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దాదాపు యాభై లక్షల మందికి పైగా మహిళా సభ్యులున్న ఐకేపీ సంఘాలను బలోపేతం చేయటంలో వీరిదే కీలకపాత్ర.
పదిహేనేళ్లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఐకేపీ ఉద్యోగులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల తరహాలోనే ఐకేపీ సిబ్బందిని పరిగణిస్తూ అలవెన్సులు, హెచ్‌ఆర్ పాలసీ విధానాన్ని అమలు చేస్తూ 58 ఏళ్ల రిటైర్‌మెంట్ వరకు ఉద్యోగ భద్రత కల్పించింది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మేరకు వేతన సవరణ చేసిన ప్రభుత్వం.. ఐకేపీ సిబ్బంది జీతాలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఐకేపీ సిబ్బంది జీతాన్ని పెంచేందుకు సీఎం చొరవ తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.