సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ వాటికి సంబంధించి మాకే పూర్తిస్థాయి అవగాహన లేదు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ వాటికి సంబంధించి మాకే పూర్తిస్థాయి అవగాహన లేదు.. ఇక ప్రజలకు ఎలా తెలుస్తాయి.. ఈ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా అన్ని వర్గాలకు అవగాహన ఉండాలి. ఇందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, గ్రామ సభలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి’ అని నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ సమావేశ మందిరంలో ఎంపీ కొండా అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కమిటీ పర్యవేక్షించింది.
అవగాహనలేమే అసలు సమస్య..
ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ఉత్తమ ఫలితాలు రావడంలేదని చైర్మన్ కొండా అభిప్రాయపడ్డారు. అవగాహన కల్పించడంలో అధికారయంత్రాంగం విఫలమవుతోందని, ప్రణాళికబద్ధంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పథకాలను ప్రజలకు చేరవేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా పథకాలతో ఎక్కువ మందికి లబ్ధి జరిగాలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. జాతీయ జీవనోపాధుల పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి ఏడాదిలో రూ.50వేల అదనపు లబ్ధి చేకూర్చాలని, జిల్లాకు రూ.10కోట్లు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం వంద మరుగుదొడ్లు నిర్మించేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు.
ఐఏవై పెండింగ్ గృహాలు త్వరలో పూర్తి : కలెక్టర్
ఇందిర ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరితంగా పూర్తి చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. వాటర్‌షెడ్ పథకాలను త్వరితంగా పూర్తిచేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. భుగర్భజలాలను పెంపొందించేందుకు ఐదెకరాల పొలం ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సంజీవరావు, జేసీ రజత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ రైతు సదస్సులకు జిల్లా యంత్రాంగం కితాబు
పొలంలోనే చెరువును ఏర్పాటు చేసుకుని కరువును అధిగమించేందుకుగాను ‘సాక్షి’ తలపెట్టిన రైతు అవగాహన సదస్సులకు జిల్లా యంత్రాంగం కితాబిచ్చింది. బుధవారం జరిగిన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు టీఆర్‌ఆర్ తదితరులు మాట్లాడుతూ ఈ సదస్సులు రైతుల ఆలోచనావిధానాన్ని మార్చివేస్తున్నాయన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా కందకాలు తవ్వించేలా ప్రణాళిక తయారుచేస్తే బాగుంటుందని వారు సూచించగా.. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి వివరించారు.