రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను రాబట్టుకునేందుకు పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.942 కోట్ల పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని డిస్కంలు ఇటీవల సర్కారుకు నివేదిక అందజేశాయి. దీంతో బకాయిలపై దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి వాటిని చెల్లించాలని తాజాగా సర్క్యులర్ జారీచేసింది. అంతేకాకుండా నిధుల్లో 80 శాతం విద్యుత్ బకాయిలకే వెచ్చించాలని కూడా అందులో పేర్కొంది.
ఈ నిర్ణయంపై సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత బకాయిల మొత్తం ఇప్పటికిప్పుడు పంచాయతీలే భరించాలనడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటున్నారు. గతంలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులన్నింటినీ ప్రభుత్వమే చెల్లించేదని, ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి బకాయిలు రూ.279 కోట్లు రాగా, ఏప్రిల్, మే నెలల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.580 కోట్లు అందాయి. ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే వెచ్చిస్తే.. గ్రామ పంచాయితీల నిర్వహ ణ ప్రశ్నార్థకమవుతుందని సర్పంచ్‌లు వాపోతున్నారు.
బిల్లులన్నీ అశాస్త్రీయమైనవే!
గ్రామ పంచాయతీల్లో బిల్లులన్నీ అశాస్త్రీయమైనవేనని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, అవసరమైన చోట్ల మీటర్లు బిగించడం విద్యుత్ శాఖ బాధ్యత అని... కానీ దానిని గ్రామ పంచాయతీలపై వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సరఫరా లైన్ల ద్వారా జరిగే నష్టాన్ని కూడా తామెలా భరిస్తామని మండిపడుతున్నారు. గ్రామ పంచాయితీల్లో ఆర్థిక సంఘం నిధులున్నాయి కదాని.. వాటిని కాజేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలువురు సర్పంచ్‌లు విద్యుత్ బకాయిల విషయాన్ని ప్రస్తావించారు. విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేయకతప్పదని సర్పంచ్‌ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.