‘లోకల్’గా పంచాయతీరాజ్ టీచర్లు
కేంద్రాన్ని కోరుతూ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పంచాయతీరాజ్ (పీఆర్) టీచర్లకు శుభవార్త. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పీఆర్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా గుర్తించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రూపొందించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఫైలును త్వరలోనే కేంద్రానికి పంపించేం దుకు చర్యలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఫైలును పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో (371డి) పీఆర్ టీచర్ పోస్టులను చేర్చేందుకు రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది.
రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో 16 ఏళ్లుగా నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ, పీఆర్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి వస్తాయి. ఫలితంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను ప్రభుత్వ, పీఆర్ టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యా శాఖ భర్తీ చేస్తుంది. మరోవైపు ఫైలుపై సీఎం సంతకం చేయడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూ-టీఎస్, టీపీటీఎఫ్, పీఆర్‌టీయూ-తెలంగాణ, టీటీయూ, టీటీఎఫ్ సంఘాల నేతలు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు, హర్షవర్దన్‌రెడ్డి, చెన్నయ్య, మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి, రఘునందన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.