పట్టాలెక్కని ఫైబర్ కనెక్టివిటీ!
♦ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మధ్య కొరవడిన సమన్వయం
♦ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే పైప్‌లైన్ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు‘మిషన్ భగీరథ(వాటర్‌గ్రిడ్)’ప్రాజెక్ట్ పైప్‌లైన్ల పనులు కొన్ని జిల్లాల్లో శరవేగంగా జరుగుతోంటే.. పైప్‌లైన్లతోపాటు వేయాల్సిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీ ప్రక్రియ మాత్రం ఇంకా మొదలుకాలేదు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటర్‌గ్రిడ్ పైపుల నిర్మాణంతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చడం ద్వారా లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా తగ్గనుందని, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఏర్పాటుకయ్యే వ్యయం భారీగా తగ్గుతున్నందున ఇంటర్నెట్ సదుపాయాన్ని అతితక్కువ ధరకు అందించేందుకు వీలుకానుందని కొన్నినెలలుగా ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పలు వేదికలపై ప్రస్తావిస్తున్నారు.
అయితే.. మంత్రి కేటీఆర్ ప్రక టనకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. సమన్వయంగా పనిచేయాల్సిన రెండు శాఖల(పంచాయతీరాజ్, ఐటీ) అధికారులు ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని పలు సెగ్మెంట్లలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే సుమారు 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన ్ల ఏర్పాటు చేశారు. త్వరలోనే రెండోదశ పైప్‌లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ ఇలా..
ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైఫై సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని భావించింది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు సుమారు 78 వేల కిలోమీటర్ల మేర భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున లైన్ల తవ్వకం చేపట్టినందున ఆ లైన్లలోనే కేబుల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో 78 వేల కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు(తవ్వకానికి)కయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు మిగలనుంది. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే వీలవుతుందని ఐటీ విభాగం అధికారులు అంచనా వేశారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వేసుకున్నట్లైతే ‘భారత్‌నెట్’ ప్రోగ్రామ్ ద్వారా నిధులను కేంద్రం రీయింబర్స్ చేయనుంది.