fiber optic cables
-
మరో సంచలన ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం
ముంబై: టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఘనతను సాధించబోతోంది. అధికమవుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో భారీ స్థాయిలో సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్ వేస్తారు. సెకనుకు 200 టెరాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ సామర్థ్యం ఉంటుంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా.. పశ్చిమాన ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని కనెక్ట్ చేస్తారు. 2024 ప్రారంభం నాటికి ఇవి పూర్తి అవుతాయి. రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్‌ఇంటర్ ఎక్స్ ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని రిలయన్స్ జియో వెల్లడించింది. ‘ఫైబర్ ఆప్టిక్ సబ్‌మెరైన్ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్వర్క్ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం’ అని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ వ్యాఖ్యానించారు. చదవండి: ఆ రోజున నెఫ్ట్ సేవలకు అంతరాయం -
చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్ ఫైబర్ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం. ఇదీ ప్రాజెక్టు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్ ఫైబర్గ్రౌండ్(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్‌కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది. చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం చైనాకు చెందిన ఎస్బీజీ అనే కంపెనీ వీటికి టెండర్ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు. రెండు అర్హతలు తప్పనిసరి... అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్‌లో ఇన్‌కార్పోరేట్ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు. అనుమతించాల్సిందే... టెండర్ కట్టబెట్టాల్సిందే ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్‌కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్‌కోలో ఆసక్తికరంగా మారింది. -
పట్టాలెక్కని ఫైబర్ కనెక్టివిటీ!
♦ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మధ్య కొరవడిన సమన్వయం ♦ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే పైప్లైన్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు‘మిషన్ భగీరథ(వాటర్‌గ్రిడ్)’ప్రాజెక్ట్ పైప్లైన్ల పనులు కొన్ని జిల్లాల్లో శరవేగంగా జరుగుతోంటే.. పైప్లైన్లతోపాటు వేయాల్సిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీ ప్రక్రియ మాత్రం ఇంకా మొదలుకాలేదు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటర్‌గ్రిడ్ పైపుల నిర్మాణంతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చడం ద్వారా లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా తగ్గనుందని, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటుకయ్యే వ్యయం భారీగా తగ్గుతున్నందున ఇంటర్నెట్ సదుపాయాన్ని అతితక్కువ ధరకు అందించేందుకు వీలుకానుందని కొన్నినెలలుగా ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పలు వేదికలపై ప్రస్తావిస్తున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ ప్రక టనకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. సమన్వయంగా పనిచేయాల్సిన రెండు శాఖల(పంచాయతీరాజ్, ఐటీ) అధికారులు ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని పలు సెగ్మెంట్లలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే సుమారు 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన ్ల ఏర్పాటు చేశారు. త్వరలోనే రెండోదశ పైప్లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ ఇలా.. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైఫై సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని భావించింది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు సుమారు 78 వేల కిలోమీటర్ల మేర భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున లైన్ల తవ్వకం చేపట్టినందున ఆ లైన్లలోనే కేబుల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో 78 వేల కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు(తవ్వకానికి)కయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు మిగలనుంది. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే వీలవుతుందని ఐటీ విభాగం అధికారులు అంచనా వేశారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వేసుకున్నట్లైతే ‘భారత్‌నెట్’ ప్రోగ్రామ్ ద్వారా నిధులను కేంద్రం రీయింబర్స్ చేయనుంది.