- ప్రభుత్వానికి చేరిన తుది ప్రతిపాదనలు
- ‘సంక్షేమం’పై కొనసాగుతున్న సందిగ్ధత
కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.. మరి ప్రభుత్వ శాఖల స్వరూపం ఎలా ఉండబోతోంది..? ఏయే మార్పులు చేయబోతున్నారు..? వేటిని విలీనం చేయబోతున్నారు..? వీటిపై ఆయా శాఖలు ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించాయి. ఆ వివరాలు శాఖల వారీగా ఓసారి చూద్దాం..
- సాక్షి, హైదరాబాద్
గ్రామీణాభివృద్ధి..ఒకే కమిషనర్ కిందకు..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విలీనమవుతుండడంతో ఇకపై ఈ సంస్థలన్నీ ఒకే కమిషనర్ కింద పనిచేస్తాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా స్థాయి హెడ్‌లుగా వ్యవహరిస్తారు. మిషన్ భగీరథ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఆర్టీసీ.. 18 మంది డివిజినల్ మేనేజర్లు..
27 జిల్లాలను 18 మంది డివిజినల్ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. విస్తీర్ణం, డిపోల సంఖ్య ఆధారంగా పెద్ద జిల్లాలకు ఒక డివిజినల్ మేనేజర్, చిన్నవైతే రెండిటికి కలిపి ఒకరు చొప్పున ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లికి కలిపి కరీంనగర్‌లో, వరంగల్, భూపాలపల్లికి కలిపి వరంగల్‌లో, హన్మకొండ, మహబూబాబాద్‌కు కలిపి హన్మకొండలో, మహబూబ్‌నగర్, వనపర్తికి కలిపి మహబూబ్‌నగర్‌లో, నల్లగొండ, సూర్యాపేటకి కలిపి నల్లగొండలో, మెదక్, సంగారెడ్డికి కలిపి సంగారెడ్డిలో, హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరిలకు హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలుంటాయి.
రిజిస్ట్రేషన్ల శాఖ
పనిభారం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉండనుంది. ప్రస్తుతం 12 మంది జిల్లా రిజిస్ట్రార్లు ఉండగా, మిగిలిన 15 పోస్టుల్లో సీనియర్ సబ్ రిజిస్ట్రార్లను డీఆర్‌లుగా నియమించనున్నారు.
పంచాయతీరాజ్..
రాష్ట్రంలో కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటవుతున్నందున ప్రస్తుతం ఉన్న ఎంపీడీవోలనే కొత్త మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేర్వేరు మండలాల్లోని గ్రామాలతో ఏర్పాటవుతున్న 10 నుంచి 12 మండలాలకు ఒక ఓఎస్‌డీని నియమించనున్నారు.
వాణిజ్య పన్నులు
కొన్ని జిల్లాల సర్కిల్ పరిధిలో మార్పు చేర్పులు జరుగుతాయి. జనగామలోని కేంద్ర కార్యాలయాన్ని యాదాద్రి జిల్లా కేంద్రానికి మారుస్తారు. భూపాలపల్లి, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు.
జిల్లాల్లో ఇక డీఐఈవో..
ఇన్నాళ్లూ జిల్లా ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్‌ఐవో) వ్యవస్థ ఉండేది. ఇకపై ఇది రద్దు కానుంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతో కొత్త కేడర్‌ను సృష్టించి అమలు చేయనున్నారు. ఇక జిల్లాల్లో పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఇకపై జిల్లా విద్యాశాఖాధికారి వ్యవస్థ మాత్రమే ఉండనుంది. సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపాదించారు.
విద్యుత్..
కొత్త జిల్లాల్లో డిస్కంల జిల్లాధికారులుగా డివిజ నల్ ఇంజనీర్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పరిధిలోని 12 సర్కిల్ కార్యాలయాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో కొత్త జిల్లాల డీఈలు పనిచేయనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్, నెడ్‌క్యాప్, సింగరేణి సంస్థలపై కొత్త జిల్లాల ప్రభావం ఏమీ లేదు.
రెవెన్యూలో సెక్షన్ల కుదింపు
కలెక్టరేట్‌లలో ఇప్పటి వరకు ఎనిమిది సెక్షన్‌లు ఉండగా వాటిని ఆరుకు కుదిస్తారు. గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు.
రోడ్లు భవనాలు
రెండు మూడు జిల్లాలను ఓ సర్కిల్‌గా చేసి ప్రతి సర్కిల్‌కు ఒక ఎస్‌ఈని కేటాయిస్తారు.
ఉద్యాన, పట్టు పరిశ్రమల విలీనం
జిల్లా స్థాయిలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారు. వీటన్నింటికీ కలిపి జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల డిప్యూటీ డెరైక్టర్లు, పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల స్థాయి అధికారులు డీఏవోలుగా ఉంటారు.
‘సంక్షేమం’ ఏం చేస్తారో..?
సంక్షేమ శాఖల విలీన ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ తుది ప్రతిపాదనలను అందజేయగా, సంక్షేమ శాఖల నుంచి మాత్రం మూడు ప్రతిపాదనలు అందాయి. అవేంటంటే..
1. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వివిధ విభాగాలను వాటి మాతృశాఖలో కలిపేయడం.
2. రెండు శాఖలు విలీనమైతే...
► బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విలీనం
► ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమాలు విలీనం
► ఇతర సంక్షేమ శాఖలన్నీ ఒకటవుతాయి
3. అన్ని శాఖలు విలీనమైతే...
► జిల్లా మొత్తానికి ఒకే సంక్షేమ అధికారి ఉంటారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో సహాయ సంక్షేమ అధికారులుగా ఉన్న వారే జిల్లా సంక్షేమ అధికారులుగా కొనసాగుతారు.
వైద్య ఆరోగ్య శాఖ
వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుత జిల్లాలకు డీఎం హెచ్‌వోలే అధిపతులుగా కొనసాగుతారు. కొత్తగా వచ్చే 17 జిల్లాలకు మాత్రం అడిషనల్ డీఎంహెచ్‌వోలు, ఏడీఎంహెచ్‌వో(పీహెచ్)లు డీఎంహెచ్‌వోలుగా నియమితులవుతారు.