చెత్త బుట్టలో వేయండి
ప్రణాళిక చెత్తగా ఉంది.. అధికారుల సంతోషానికో.. అవసరాలు తీర్చేందుకో.. ఈ ప్రణాళిక తయారు చేయవద్దు. మీ ఇష్టానుసారంగా ప్రణాళిక తయారు చేస్తే ప్రజల అవసరాలు ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆదేశాలు పునరాలోచించుకోవాలి. ప్రజల సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల అవసరాలు తీర్చేవిధంగా, పకడ్బందీగా జిల్లా ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటికే గ్రామ, మండల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జిల్లా స్థాయి అధికారులు అనుభవంతో ఉంటారు. కాని మీరు తయారు చేసిన ప్రణాళిక చెత్త బుట్టలో పడేసే విధంగా ఉంది. ఒక్క ప్రణాళిక కూడా సంక్షేమానికి ముడిపడి లేదు అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు.
నిజామాబాద్ నాగారం : రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాత్రి 10 గంటలకు అధికారులతో మని జిల్లా ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరి సంక్షేమం కోసం ప్రణాళిక తయారు చేయాలన్నారు. అయితే పంచాయతీరాజ్ విషయంలో కేవలం భవనాల నిర్మాణానికే, మండలంలోని మండల కాంప్లెక్స్‌లకు రూ. 3 కోట్లు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని కలెక్టరేట్‌లోనే పెద్ద ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకు రూ. 10 కోట్లు మంజూరు చేశామన్నారు.
జిల్లా పరిషత్ భవనాల కోసం ప్రణాళిక తయారు చేయవద్దని, జిల్లా అధికారులు ప్రణాళిక తయారు చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు ముఖ్యంగా రోడ్లు, కల్వర్టు, బ్రిడ్జిలు, తదితర పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీటి నిర్మాణం కోసం ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించడం సరికాదన్నారు. పక్కగా ప్రాక్టికల్‌గా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించే విధంగా ఉండాలన్నారు. పశుసంవర్దకశాఖకు, వ్యవసాయశాఖలకు సంబంధించి మండల భవనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. చెరువుల మరమ్మతులకు సైతం ఒక్కో చెరువుకు రూ. 50 లక్షలు కేటాయించడం సరికాదన్నారు. కేవలం రూ. 10 లక్షలలోపే మరమ్మతులు పూర్తవుతాయన్నారు.
భవిష్యత్ గురుకులానిదే..
జిల్లాలోని ప్రతి మండలంలో 4,5 గురుకుల పాఠశాలలను వసతితో పాటు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటు కులభేదాలు ఉండవని, అన్ని వర్గాల విద్యార్థులు చదువుకొని వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ విద్యార్థులకు రూ. 5,600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
మన విద్యార్థులందరు బాలబాలికలు ఒకేదగ్గర చదువుకొని మన సంప్రదాయాన్ని ఒట్టిపడే విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా చదువులు ఉంటాయన్నారు. అందువల్ల చిన్న చిన్న హాస్టళ్లకు ప్రాముఖ్యత ఇవ్వరాదన్నారు. అధికారులందరూ మళ్లీ ఒక్కసారి ప్రణాళికను ప్రాక్టికల్‌గా తయారు చేసి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, ఐకెపీ పీడీ వెంకటేశం, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.