హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ఏటా ఇస్తున్న అవార్డుల్లో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 12 పురస్కారాలు సాధించింది. ఒక ఉత్తమ జెడ్పీ (మెదక్–సంగారెడ్డి) అవార్డు, రెండు ఉత్తమ మండల పరిషత్ (కోరుట్ల, ధర్మారం) అవార్డులతో పాటు మరో 9 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు తెలంగాణను వరించాయి. 2019–20 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులు–2021 కింద రాష్ట్రంలోని వివిధ పంచాయతీరాజ్ సంస్థలకు ఈ అవార్డులు లభించాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయ్ కుమార్ బెహరా బుధవారం రాత్రి ఈ పురస్కారాలను ప్రకటించారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ తదితర అవార్డులు ఇచ్చినట్టు బెహరా తెలియజేశారు. గత ఏడాది యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీలు) సమర్పణకు అనుగుణంగా అవార్డులు గెలుచుకున్న పంచాయతీరాజ్ సంస్థలకు అవార్డుకు సంబంధించిన నగదు విడుదల చేస్తామని చెప్పారు. మెదక్ జెడ్పీ (సంగారెడ్డి), జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండల పరిషత్, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండల పరిషత్‌లు జనరల్ కేటగిరీలో అవార్డులు సాధించాయి.
అవార్డులు సాధించిన పంచాయతీలివే..
థిమేటిక్–మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఇంప్రూవ్‌మెంట్ కేటగిరీ కింద కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (ఎల్‌ఎండీ) మండలం పార్లపల్లి, థిమేటిక్–నాచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం హరిదాస్‌నగర్, థిమేటిక్–శానిటేషన్ కేటగిరీలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి, ఇదే జిల్లాలోని నారాయణరావు పేట మండలంలోని మల్యాల్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి, జనరల్ కేటగిరీలో మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండంలోని చక్రాపూర్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కార్‌కు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినీకుంట, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డుకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల అవార్డులు సాధించాయి.
మంత్రి ఎర్రబెల్లి హర్షం
రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 12 అవార్డులు రావడంపై పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధి అనే ట్యాగ్ లైన్ తీసుకుని కేంద్రం ఉత్తమ జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు లభించాయని చెప్పారు. రాష్ట్రానికి ఏటా అవార్డులు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment