గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు | Villages in the country's powerhouse | Sakshi
Sakshi News home page

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు

Published Fri, Oct 3 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

Villages in the country's powerhouse

గీసుకొండ : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని,  గంగదేవిపల్లి గ్రామం దేశానికి మకుటాయమానంగా నిలుస్తోందని పంచాయతీరాజ్ కమిషనర్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లిలో ‘స్వచ్ఛతా పంచాయతీ సప్తాహ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

గతంలో గంగదేవిపల్లిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి సందర్శించి తనకు ఎంతో గొప్పగా చెప్పారని, అప్పుడే ఈ గ్రామాన్ని చూడాలని అనిపించిందన్నారు. పరి శుభ్రతను పాటించడంలో అన్నీ ఉత్తమ వార్డులే ఉండడం గంగదేవిపల్లికే సాధ్యమైందన్నారు. అందరి కోసం అందరూ పనిచేయాలన్న సూత్రాన్ని గంగదేవిపల్లి సాకారం చేసిందన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న అపార్డు శిక్షణ కేంద్రానికి మరో నెల రోజుల్లో నిధులు మం జూరు చేయిస్తానన్నారు.
 
గంగదేవిపల్లి చరిత్ర  ప్రపంచవ్యాప్తమవుతోంది : కలెక్టర్

కాకతీయుల చరిత్ర లాగానే గంగదేవిపల్లి చరి త్ర కూడా ప్రపంచ ప్రజలకు తెలిసిపోతోందని కలెక్టర్ కిషన్ అన్నారు. ఇప్పటికే గ్రామాన్ని 76 దేశాల వారు సందర్శించారని, ఎన్నో అవార్డు లు వచ్చాయని కితాబిచ్చారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజాప్రతినిధులతో మాట్లాడినా గంగదేవిపల్లి ప్రజలు సాధించిన విజయాల గురించే చెబుతున్నానని తెలిపారు. స్వఛ్చ భారత్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని గంగదేవిపల్లి చాలా ముందుగానే సాధించిందన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, డీఎల్‌పీవో రాజేందర్, ఎంపీడీవో పారిజాతం, తహసిల్దార్ మార్గం కుమారస్వామి, ఈఓపీఆర్‌డీ భీంరెడ్ది రవీంద్రారెడ్డి, ఆర్‌ఐ గట్టికొప్పుల రాంబాబు, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు. స్వచ్ఛత  పంచాయతీ సప్తాహ్ సందర్భంగా కమిషనర్, కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు, అధికారులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
 
11న న్యూఢిల్లీకి సర్పంచ్..

గంగదేవిపల్లిపై ఇటీవల నేషనల్ ఫిల్మ్ సొసైటీ రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 11న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చూస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సర్పంచ్ ఇట్ల శాంతిని ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ తెలిపారు. గంగదేవిపల్లి గురించి వివరించడానికి తనతోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ పర్యటనకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ వివరించారు.
 
కనెక్షన్ ఇచ్చే వరకూ ఇక్కడే ఉంటా..
 
తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయాన్ని ఉపసర్పంచ్ కూసం రాజమౌళి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన ఆయన ‘పది రోజుల క్రితమే ఎస్‌ఈకి చె ప్పిన.. ఇంకా కనెక్షన్ ఇవ్వలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఇప్పుడు గంగదేవిపల్లిలోనే ఉన్నానని చెప్పు.. కరెంటు ఇవ్వకుండా కదలనని చెప్పు...’ అంటూ కలెక్టర్ తన పీఏతో ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మోహన్‌రావుకు ఫోన్ చేయించారు. దీంతో ఎన్పీడీసీఎల్  అధికారులు అప్పటికప్పుడు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. కరెంటు మీటర్లు ఉన్న వాటికి ఈ ఏడాది నుంచి  విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని వాటికి చెల్లించవద్దని, సరఫరాను నిలిపివేస్తే తనకు ఎస్‌ఎంఎస్ చేయాలని కలెక్టర్ సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement