ఇది సంస్కరణల తెలంగాణ | KTR Gives Speech In Panchayati Raj Meet At Sircilla | Sakshi
Sakshi News home page

ఇది సంస్కరణల తెలంగాణ

Published Fri, Feb 21 2020 1:29 AM | Last Updated on Fri, Feb 21 2020 1:29 AM

KTR Gives Speech In Panchayati Raj Meet At Sircilla - Sakshi

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో అనేక సంస్కరణలకు వేదిక అయిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన పల్లె ప్రగతిపై పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలు ఉన్న తెలంగాణ పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా మారిందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలతో ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. పల్లె ముఖచిత్రం మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని, ఆ మార్పును కొనసాగించే దిశగా ఇప్పుడు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంచి పల్లెలను తీర్చిదిద్దాలని కోరారు. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని, ప్రతి ఊరిలో ట్రాక్టర్‌ ఉండాలన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పనిచేయకుంటే పదవులు కోల్పోతారని, ఈ విషయంలో కఠినంగా ఉంటామని మంత్రి హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లనే ముందు తొలగిస్తామని స్పష్టం చేశారు.

పల్లె ముఖచిత్రం మారాలి 
ప్రతి ఊరిలో నర్సరీ ఉండాలని, చెత్త లేకుండా వీధి శుభ్రంగా ఉండాలని, డంపుయార్డులు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు ఉండాలని కేటీఆర్‌ సూచించారు. పల్లెల్లో సేకరించే తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, పొడి చెత్తను విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తామని చెప్పారు. ఏ ఊరికి ఆ ఊరి ప్రజాప్రతినిధులే కథానాయకులై పల్లెల్లో మార్పు తేవాలన్నారు. అందరూ మిషన్‌ భగీరథ నీళ్లనే తాగాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఆకస్మిక తనిఖీలు ఉంటాయి 
పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా అందరూ క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పల్లెల్లో మార్పు కనిపించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటిన మొక్కల్లో 85% బతకాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లకు ప్రభుత్వం త్వరలో నిధులు మంజూరు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.

ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతాం 
ఆడపిల్లలకు ఆత్మరక్షణకు శిక్షణ ఇస్తామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో బాలికల హాస్టల్‌లో లైంగిక వేధింపుల ఘటనపై ఆయన గురువారం హాస్టల్‌ను సందర్శించి బాలికలతో మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఎవరూ చేసినా తప్పేనని కేటీఆర్‌ అన్నారు. ఈ విషయం తెలియగానే దేవయ్యను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించామని, చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. 

సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement