రాష్ట్రంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచుల అధికారాలను ఒక్కొక్కటిగా కత్తిరించేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆఖరి అధికారంపై కూడా వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ.. గ్రామ సర్పంచులను డమ్మీలుగా మార్చేసి, వారికి ఉండే కీలక అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు జరగాల్సిన గ్రామసభల నిర్వహణ అధికారాన్ని ఇకపై జన్మభూమి కమిటీలకు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం.. గ్రామసభలకు స్థానిక సర్పంచి అధ్యక్షత వహించాలి. సర్పంచి లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి.