ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న పోతన సదానందం శనివారం
=అమీన్‌పేట మాజీ సర్పంచ్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
=పంచాయతీరాజ్ శాఖలో కలకలం
జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న పోతన సదానందం శనివారం రాత్రి ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన ఆ శాఖలో కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం.. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెన్నారావుపేట మండలం ఆమీన్‌పేటకు 2011లో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.10.28 లక్షలు మంజూరయ్యాయి.
అప్పటి సర్పంచ్ చిలుపూరి యాకయ్య భవన నిర్మాణ పనులు చేపట్టాడు. బిల్డింగ్ బేస్‌మెట్ లెవల్ పూర్తిచేసి బిల్లు చేయాలని కోరగా ఏఈ ముందుగా డబ్బులు ఇవ్వాలని అడగడంతో అప్పు చేసి పర్సంటేజీ ఇచ్చాడు. అతడికి రూ.1.50 లక్షలు రావాల్సి ఉండగా కేవలం రూ.87 వేలు మాత్రమే అధికారులు బిల్లు చేశారు. మిగతా డబ్బుల కోసం అడగగా భవనం పూర్తి చేస్తే మొత్తం బిల్లు చేస్తానని ఏఈ చెప్పడంతో అప్పు చేసి మరి యూకయ్య ఎనిమిది నెలల క్రితం భవన నిర్మాణం పూర్తి చేశాడు.
అనంతరం బిల్లు మంజూరు చేయూలని ఏఈ సదానందంను కోరగా 5 శాతం పర్సంటేజీ ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఖరాకండిగా తేల్చిచెప్పాడు. బిల్లు వచ్చాక అందులో నుంచి పర్సెంటేజీ ఇస్తానని చెప్పి బతిమిలాడినా వినకుండా ఏఈ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు పత్తి అమ్మి డబ్బులు తీసుకొస్తాను.. ఎంబీ రికార్డు చేసి సిద్ధంగా ఉంచాలని కోరగా ముందుగా ఇస్తే తప్పా బిల్లులు చేయనని పుస్తకాలను విసిరికొట్టాడు. రూ.20 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో రూ.15 వేలు ముందుగా ఇస్తానని బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
బిల్లు కోసం తిరిగి విసిగివేసారిన యాకయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం సాయంత్రం హన్మకొండకు వచ్చి ఏఈ సదానందానికి ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ఏఈ ప్రశ్నించగా తాను కాళోజీ సెంటర్‌లో ఉన్నానని చెప్పడంతో జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోకి రావాలని యాకయ్యకు ఏఈ సూచించారు. ఇద్దరు జెడ్పీ కార్యాలయం ఎదుట మాట్లాడుకున్నారు. ఎదురుగా ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎవరన్నా ఉన్నారో చూసి రావాలని యాకయ్యకు సూచించగా ఎవరు లేరని చెప్పడంతో ఇద్దరు కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ యాకయ్య ఏఈ సదానందానికి రూ.15 వేలు ముట్టజెప్పాడు.
మాటల్లో పెట్టి.. అధికారులకు సిగ్నల్ ఇచ్చి..
ఎంబీ బుక్కులు ఇవ్వాలని కోరగా సోమవారం ఇస్తానని చెప్పాడు. డబ్బులు ఇవ్వగానే ఎంబీ ఇస్తానని చెప్పి.. ఇప్పుడు ఇలా ఎందుకు చెబుతున్నావని ఏఈపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా అతడి ని మాటల్లో పెట్టిన యూకయ్య ఏసీబీ అధికారులకు సిగ్నల్ ఇచ్చాడు. అప్పటికే జెడ్పీ కార్యాలయం అవరణలో ఉన్న ఏసీబీ అధికారులు నలువైపుల నుంచి వచ్చి సదానందంను ఆదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాశిబుగ్గకు చెందిన సదానందం చెన్నారావుపేట ఏఈగా విధులు నిర్వర్తిస్తూ హన్మకొండ టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తు తేలిందని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. సదానందంను ఆరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ ఏసీబీ సీఐలు రాఘవేందర్‌రావు, సాంబయ్య, బాపురెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.