పంచాయతీల్లో మహిళలకు 50%!
రిజర్వేషన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు
* వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సవరణలు
* ‘వితంతు పింఛన్’ వయసు తగ్గింపునకు యోచన
* కేంద్ర మంత్రి బీరేందర్ వెల్లడి
న్యూఢిల్లీ: పంచాయతీల్లో మహిళల కోటాను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన సవరణలను వచ్చే బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గురువారమిక్కడ ‘పెసా (పంచాయతీలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే) చట్టం అమల్లో సమస్యలు, పురోగతి’ అంశంపై ప్రారంభమైన రెండ్రోజుల సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడారు.
బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఒక వార్డును మహిళలకు ఐదేళ్లపాటు రిజర్వేషన్ కింద కేటాయిస్తున్నారని, దీన్ని రెండు విడతలకు (పదేళ్లు) పెంచే ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై ఏ పార్టీ కూడా విముఖత చూపకపోవచ్చని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వేషన్ కింద కేటాయించారు.
అలాగే ప్రస్తుతం వితంతు పింఛన్‌కు అర్హత వయసు 40 ఏళ్లు ఉండగా, ఈ వయసును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దేశంలో గిరిజనులు తమ సంస్కృతికి, విలువలకు కట్టుబడి ఉన్నారని, అందువల్లనే సామ్రాజ్యవాద శక్తులు ఇతర దేశాల్లో మాదిరి వారిని నిర్మూలించలేకపోతున్నాయన్నారు. 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి!
గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. పీహెచ్‌డీ పట్టాలను ఇచ్చేందుకు వీలుపడడమేకాక అత్యున్నతస్థాయి పరిశోధనలకోసం నిపుణులను నియమించుకోవడానికి అవకాశముంటుందని భావిస్తోంది. గిరిజన పరిశోధన సంస్థలకు ఆర్థిక, విద్యాసంబంధ విషయాల్లో మరింత స్వయంప్రతిపత్తి కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది.
కోర్టు వెలుపలి పరిష్కారాలకు చట్టం!
కోర్టు వెలుపలి పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ మధ్యవర్తిత్వ విధానం వైవాహిక సమస్యల పరిష్కారానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని, కొత్త చట్టం అమల్లోకి వస్తే పారిశ్రామిక వివాదాలు, భూ యజమానులు-కౌలు రైతుల వివాదాలు కూడా ఈ విధానం ద్వారా పరిష్కారమవుతాయని భావిస్తోంది.