‘పాలకవర్గం అనుమతి లేకుండా పనులు చేయడానికి లేదు. అలాగని పాలకవర్గం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించనూ కూడదు.
దివాన్‌చెరువు (రాజానగరం) : ‘పాలకవర్గం అనుమతి లేకుండా పనులు చేయడానికి లేదు. అలాగని పాలకవర్గం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించనూ కూడదు. ఈ వ్యత్యాసాలన్నింటినీ సరిచేయడానికే వచ్చాను’ అని పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ ఎం.సుధాకర్ అన్నారు. దివాన్‌చెరువు పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు నిబంధనల మేరకు జరగడం లేదనే ఆరోపణలపై ఆయన బుధవారం విచారణ నిర్వహించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని, విచారణ వివరాలు బహిర్గతం చేయరాదని విలేకరులతో అన్నారు. పాలకవర్గం వచ్చిన నాటి నుంచి ఉన్న రికార్డులను, అందుబాటులో ఉన్న మరికొన్ని రికార్డులను పరిశీలించారు.
అనంతరం సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. సర్పంచ్‌కి గాని, పాలకవర్గానికి గాని సంబంధం లేకుండా పనులు చేస్తున్నారని ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్ ఫిర్యాదు చేశారు. అలా చేయకూడదని చట్టం ప్రకారమే విధులు నిర్వహించాలని సుధాకర్ పేర్కొన్నారు. సమావేశాలకు ఎన్నికైన సభ్యులే హాజరుకావాలని, ప్రత్యామ్నాయంగా వేరొకరు హాజరుకావడానికి వీలులేదని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అనుసరించి పం చాయతీ కార్యదర్శి కూడా విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు.
‘ఈ విషయంలో మీకు సైరె న అవగాహన లేనట్టుంద’ంటూ సామర్లకోటలో ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేస్తామని, హాజరు కా వాలని సభ్యులకు సూచించారు. కమిషనర్ వెళ్లిన తరువాత గ్రామ రాజకీయాలు నాయకుల మధ్య ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎవరికి వారే కేకలు అరుపులతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వేడెక్కించారు. డీఎల్‌పీఓ ప్రసాదరావు, ఈఓపీఆర్డీ జాన్‌మిల్టన్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు, ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వంక మల్లికార్జుస్వామి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.