ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీరాజ్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మరింత బలహీన పరుస్తోందని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి.
పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీరాజ్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మరింత బలహీన పరుస్తోందని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి.అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోందన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 2న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంచాయతీ సమస్యలపై పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 1324 స్థానిక సంస్థలకు తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు బాధ్యతలను పంచాయతీల నుంచి తప్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరనున్నామని చెప్పారు. పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అలజంగి.భాస్కరరావు, పిట్టా రాంబాబు, ఫృథ్వి తదితరులు పాల్గొన్నారు.