సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో సుమారు 27 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి తహసీల్దారు వరకూ 585 మంది, గ్రామ రెవెన్యూ అధికారుల క్యాడరులో 540 మంది ఉన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లు కలిపి 4,500 మంది ఉండగా...పంచాయతీరాజ్‌లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఇక జిల్లాలో మిగతా ప్రభుత్వ శాఖల్లో పదుల సంఖ్యలోనే ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో సంఖ్యాపరంగా దాదాపు 12 వేల మంది ఉన్న ఉపాధ్యాయులదే అగ్రభాగం. వీరి కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఉపాధ్యాయుల బదిలీలు మాత్రం ఈ సంవత్సరానికి ఉండకపోవచ్చని ఆ సంఘాల నాయకులు చెబుతున్నారు.
షెడ్యూల్ విడుదల ఆలస్యం
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మే నెలలో నిర్వహిస్తుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ విషయంలో అలక్ష్యం వహిస్తోంది. ఈసారి కూడా అదే వైఖరి కనబరచింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో ఇది మూడో బదిలీ ప్రక్రియ. కానీ గత రెండు ప్రక్రియలూ విద్యాసంవత్సరం మధ్యలోనే జరిగాయి. ఈసారి కూడా జూన్ ఆఖరు వరకూ షెడ్యూల్ ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తికావడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని భయపడుతున్నారు.
సిఫారసుల కోసం అగచాట్లు!
గత రెండుసార్లు చేపట్టిన బదిలీల్లో అధిక శాతం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేల సిఫారసులతోనే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీ వరకూ వెళ్లింది. తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండటంతో ఉద్యోగులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పలువిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వారి సిఫారసు లేఖలతో ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలుస్తున్నారు. కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో తమకు నచ్చిన వారిని నియమించుకునేందుకు నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల తమ పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని కొంతమంది ఉద్యోగులు భయపడుతున్నారు.
దీంతో తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, లేదంటే తమకు అనుకూలమైన స్థానంలో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావుతో పక్క జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రు డు, గంటా శ్రీనివాసరావులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారు ప్రధానంగా నీటిపారుదల, రవాణా, రెవెన్యూ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు.
ఇబ్బందులెన్నో...
బదిలీల ప్రక్రియను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే 14వ తేదీ నుంచి ప్రారంభమైతే కేవలం ఏడు రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడమంటే కత్తిమీద సామే. బదిలీపై అప్పీళ్లు, పొరపాట్లు సరిచేయడం వంటివన్నీ పూర్తి చేయడం కష్టమే. అధికార పార్టీ నాయకుల సిఫారసులు, కొంతమంది ఉద్యోగుల పైరవీలకు పెద్దపీట వేయడానికే ఇంత తక్కువ సమయం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీవోలో 20 శాతం వరకూ బదిలీలు చేసే అవకాశం ఇచ్చినప్పటికీ గత రెండు పర్యాయాల్లో బదిలీల్లో ఎక్కువ మందిని బదిలీ చేయడం వల్ల ఈసారి 10 శాతం మించి బదిలీలు జరగపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బదిలీలపై కామన్ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం శాఖాపరంగా మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీనివల్ల ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడంపై కూడా గందరగోళం నెలకొంది.
బది‘లీల‘లెన్నో!
Published Sat, Jun 11 2016 11:34 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement