కాంట్రాక్టర్లు ఒక్కటై ముందే ఒప్పందాలు కుదుర్చుకుని అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టును పం చుకున్నారు.
గద్వాల న్యూటౌన్ : కాంట్రాక్టర్లు ఒక్కటై ముందే ఒప్పందాలు కుదుర్చుకుని అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టును పం చుకున్నారు. గురువారం 21 పనులకు అంచనా ధరలు వేసి టెండ‘రింగ్’ చేశారు. అలంపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలలోని అడ్డాకుల, భూత్పూర్, చిన్నచింతకుంట, దేవరకద్ర, కొత్తకోట, ఆత్మకూర్, మాగనూరు, మక్తల్, నర్వ, ఉట్కూరు, అలంపూర్, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లిలో రూ.3.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 53 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల కోసం టెండర్లు ఆహ్వానించారు.
గద్వాల పంచాయతీ రాజ్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో పనికి రూ.6.50 లక్షలుగా నిర్ణయించారు. షెడ్యూలు ధరలు రూ.1200గా నిర్ణయించారు. మొత్తం 287 షెడ్యూళ్లు అమ్ముడుపోగా... 286 షెడ్యూళ్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అయితే పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. మధ్యదళారులు కొంతమంది చేరి కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదుర్చారు. పనులను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. కార్యాలయం వెలుపలా, ఆవరణలో ఉదయం నుంచి మంతనాలు సాగించారు. మొత్తం 53 పనుల్లో 21 పనులకు అంచనా ధరలు వేశారు. మరో 32 పనులు మాత్రం లెస్‌కు దాఖలయ్యాయి. కార్యాలయం వెలుపలా కాంట్రాక్టర్లు కుమ్మక్కైన విషయం తమ పరిధిలోకి రాదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.