పల్లెల్లో తాగునీటి
గ్రామాల్లో మొదలైన తాగునీటి గోస
నల్లగొండ, న్యూస్‌లైన్,ఎన్నికల బిజీలో నేతలు..అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు పల్లెల్లో తాగునీటి గోస మొదలైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపిం చడంలేదు. బోరు బావుల్లో జలాలు అడుగంటిపోయాయి. మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీళ్లు వదలుతున్నారు. ఎండలు మరింత ముదిరితే మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది.
నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు వేసవి ప్రణాళికను సిద్ధం చేసినా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వేసవిలో మండుతున్న ఎండలతో పల్లె ప్రజల గొంతెండుతోంది. తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొదటి పేజీ తరువాయి
532 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది.
దాదాపు వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండలు మరింత ముదిరితే ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. నీటిని ఎద్దడి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారిం చాల్సిన అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారు. జిల్లా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు ఎన్నికల విధుల్లో తీరికలేకుండా గడుపుతున్నారు.
అధికారుల అంచనా ప్రకారం..
ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా 37 మండలాల పరిధిలోని 532 గ్రామాల్లో నీటిఎద్దడి అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. మరో 457 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
అడుగడుగునా సమస్యలే...
ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో జిల్లాలో 19,384 బోరు బావులు ఉన్నాయి. వీటిలో 952 బోర్లు పనిచేయడం లేదు. మరో 136 బోరు బావుల్లో నీరు అట్టడుగుస్థాయిలోకి వెళ్లిపోయింది. 244 బోర్లను క్రషింగ్ చేయాల్సి ఉంది. అంటే నీరు అందుబాటులో ఉన్నా వివిధ రకాల సమస్యలతో బోర్లలోకి రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.
ఇక మంచినీటి పథకాల విషయానికొస్తే జిల్లాలో 15 మంచినీటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రోజు విడిచి రోజు 1151 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మాదారం మంచినీటి పథకం ఎందుకు పనికిరాకుండా పోయింది. మోతె మండలంలో నిర్మించిన మంచినీటి పథకానికి నాణ్యత గల పైపులు వేయకపోవడంతో అన్ని గ్రామాలకు నీరు చేరడం లేదు. దీంతో పాటు విద్యుత్ సమస్య మంచినీటి పథకాలకు గుదిబండలా తయారైంది.
గ్రామాల్లో గోస...
పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి ఇలాకా అయిన అనుమల మండలంలో 32 హ్యాబిటేషన్లలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో అత్యధికంగా సంస్థాన్‌నారాయణ్‌పూర్ మం డలంలో 73 హ్యాబిటేషన్లలో మంచి నీటి ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత వరుసగా చౌటుప్పుల్ మండల పరిధిలో 24, చందంపేట-14, ఆత్మకూరు (ఎస్ )-30, మోతె-20, చివ్వెంల-37, సూర్యాపేట-23, దామరచర్ల-27, వేములపల్లి-20, మునగా ల-20, పెన్‌పహాడ్-30 గ్రామాల్లో నీటి ఎద్దడి జఠిలంగా ఉంది.
నీటి ఎద్దడి నివారణకు రూ.2.85 కోట్లు...
నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నివారణ కోసం ప్రభుత్వానికి జిల్లా యం త్రాంగం రూ.2.85 కోట్లు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదనలు పం పింది. ఈ నిధులతో వేసవి నీటిఎద్దడి తీవ్రతరం కానున్న 532 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, అద్దెబోర్లు, బోరు బావుల మరమ్మతుల కోసమని ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయా పైసా విడుదల కాలేదు.
అధికారుల వద్ద చిల్లగవ్వ లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే తప్ప ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. కానీ నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాని పరిస్థితి ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అధికారులు చెబుతున్నారు.