Rural Drinking Water Supply Department
-
అంతర్జాతీయ స్థాయిలో.. తాగునీటి ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: తాగునీటిలో అత్యంత సూక్ష్మస్థాయిలో దాగి ఉండే విషపూరిత కారకాలను ముందే పసిగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లను పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తోంది. సీసం, పాదరసం వంటి కొన్నిరకాల మూలకాలతో పాటు పురుగు మందుల అవశేషాలున్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించడంవల్ల క్యాన్సర్, కిడ్నీ సంబంధిత ప్రమాదకర రోగాల బారినపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్‌లలో ఇలాంటి ప్రమాదకర కారకాలను గుర్తించే సౌకర్యాల్లేవని అధికారులు తెలిపారు. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 112 ల్యాబ్‌లలో కేవలం ఫ్లోరైడ్, కాల్షియం, ఐరన్ వంటి 14 రకాల భారీ మూలకాలను మాత్రమే గుర్తించే వీలుంది. కానీ, అతి సూక్ష్మస్థాయిలోని ప్రమాదకర మూలకాలను, పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు లేదు. ఈ నేపథ్యంలో.. 70 రకాల అతిసూక్ష్మ మూలకాలతో పాటు 24 రకాల పురుగుమందుల అవశేషాలను గుర్తించగలిగేలా ఈ ల్యాబ్‌లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. తద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 10–15 రోజుల్లోనే ఆధునిక యంత్రాలను రాష్ట్రానికి పంపిస్తుందని అధికారులు తెలిపారు. ఏలూరు ఘటనతో చర్యలు వేగవంతం సాధారణంగా రైతులు పంటలపై పిచికారీ చేసిన పురుగు మందుల అవశేషాలు ఏదో ఒక రూపంలో నీటిలో కలిసిపోతుంటాయి. ఆ నీరే భూగర్భంలో ఇంకిపోవచ్చు.. లేదంటే సమీపంలో వాగులు వంకలతో పాటు అక్కడకు దగ్గరగా ఉండే సాగునీటి కాలువలలోనే కలిసే అవకాశం ఉంది. సాగునీటి కాల్వల ద్వారా పారే ఈ తరహా నీరు ఒక్కోసారి ప్రజల తాగునీటి అవసరాల కోసం ముందస్తుగా నీటిని నిల్వచేసే స్టోరేజీ ట్యాంకుల్లోనూ కలిసే అవకాశం ఉంటుంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పెద్ద సంఖ్యలో స్థానికులు అనారోగ్యానికి గురైన ఘటన ఈ కోవకు చెందిందే. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణుల బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి తాగునీటిలో సీసం, పాదరసం వంటి మూలకాలతోపాటు కొన్ని పురుగు మందుల అవశేషాలున్నట్లు గుర్తించింది. ఇదే విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తాగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ల ఆధునీకరణకు పూనుకుంది. ముందుగా గోదావరి జిల్లాల్లో 4 ల్యాబ్‌లు.. ల్యాబ్‌ల ఆధునీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని నాలుగు ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఏలూరు ప్రాంతంలోని ఓ ల్యాబ్‌తో పాటు ఇదే జిల్లాలో ఆక్వాసాగు ఎక్కువగా ఉండే నరసాపురం డివిజన్ పాలకొల్లులో మరొకటి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని ల్యాబ్‌లనూ ఆధునీకరిస్తారు. వీటికి ఆధునిక నీటి పరీక్షల యంత్రాల సరఫరాతో పాటు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలను అమెరికాకు చెందిన ‘పెర్కిన్ ఎలయర్’ సంస్థకు అప్పగించారు. అక్టోబర్ 1 నుంచి వాటిల్లో అన్ని రకాల నాణ్యత పరీక్షలు మొదవుతాయని అ«ధికారులు వెల్లడించారు. ఎగుమతులకు ముందు చేసే పరీక్షల్లాగే.. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే ముందు వాటికి నాణ్యత పరీక్షలు చేయడం తప్పనిసరి. వాటిపై ఎలాంటి పురుగు మందుల అవశేషాల్లేవని నిర్ధారిస్తూ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే ఓడలో లోడింగ్‌కు అనుమతిస్తారు. ఈ తరహా పరీక్షలనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆధునీకరిస్తున్న ల్యాబ్‌లలో నిర్వహిస్తారు. ఇక్కడ ఒక్కో పరీక్షకు రూ.12 వేల చొప్పున ఫీజుగా చెల్లించాలి. ఏలూరు ఘటన సమయంలో హైదరాబాద్‌లో ఒక్కో శాంపిల్ పరీక్షకు రూ. 15 వేల చొప్పున ఫీజు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నిర్ణీత రుసుంకు ప్రైవేట్ వ్యాపారుల శాంపిల్స్‌ను కూడా పరీక్షించే ఆలోచన ఉందన్నారు. -
బావులు, బోర్లు వద్ద నీళ్లు బంద్
సాక్షి, అమరావతి: బావులు, బోర్ల నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితికి ఇకపై చెల్లుచీటి పడనుంది. తాగునీటి అవసరంతో పాటు రోజు వారీ సాధారణ అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారానే సరఫరా చేసే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 95.66 లక్షల ఇళ్లు ఉంటే.. ఇందులో ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లలో కుళాయిలున్నాయి. వీటికే ప్రస్తుతం నేరుగా నీటిని సరఫరా చేసే వీలుంది. మిగిలిన 63.73 లక్షల ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.10,975 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ ఖర్చులో సగం కేంద్రం జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద భరించనుంది. ► నాలుగేళ్ల కాల పరిమితిలో తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయిలు ఏర్పాటుచేయాలన్నది ఆర్డబ్ల్యూఎస్ లక్ష్యం. ఇందుకు రూ.4,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.2,400 కోట్లు జలజీవన్ మిషన్ కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ► మంచినీటి పథకం, ఓవర్òహెడ్ ట్యాంకు వంటివున్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ గ్రామాల్లో తొలుత అన్ని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత 75 శాతం ఇళ్లకైనా నీటి సరఫరా చేసే సామర్థ్యం ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిస్తారు. ► తొలి ఏడాది 32 లక్షలు, రెండో ఏడాది 25 లక్షలు మూడో ఏడాది 5 లక్షలు, నాలుగో ఏడాది మిగిలిన ఇళ్లకు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. -
అప్పుడే.. జఠిలం
గ్రామాల్లో మొదలైన తాగునీటి గోస నల్లగొండ, న్యూస్‌లైన్,ఎన్నికల బిజీలో నేతలు..అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు పల్లెల్లో తాగునీటి గోస మొదలైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపిం చడంలేదు. బోరు బావుల్లో జలాలు అడుగంటిపోయాయి. మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీళ్లు వదలుతున్నారు. ఎండలు మరింత ముదిరితే మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు వేసవి ప్రణాళికను సిద్ధం చేసినా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వేసవిలో మండుతున్న ఎండలతో పల్లె ప్రజల గొంతెండుతోంది. తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొదటి పేజీ తరువాయి 532 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. దాదాపు వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండలు మరింత ముదిరితే ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. నీటిని ఎద్దడి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారిం చాల్సిన అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారు. జిల్లా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు ఎన్నికల విధుల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా 37 మండలాల పరిధిలోని 532 గ్రామాల్లో నీటిఎద్దడి అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. మరో 457 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అడుగడుగునా సమస్యలే... ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో జిల్లాలో 19,384 బోరు బావులు ఉన్నాయి. వీటిలో 952 బోర్లు పనిచేయడం లేదు. మరో 136 బోరు బావుల్లో నీరు అట్టడుగుస్థాయిలోకి వెళ్లిపోయింది. 244 బోర్లను క్రషింగ్ చేయాల్సి ఉంది. అంటే నీరు అందుబాటులో ఉన్నా వివిధ రకాల సమస్యలతో బోర్లలోకి రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక మంచినీటి పథకాల విషయానికొస్తే జిల్లాలో 15 మంచినీటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రోజు విడిచి రోజు 1151 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మాదారం మంచినీటి పథకం ఎందుకు పనికిరాకుండా పోయింది. మోతె మండలంలో నిర్మించిన మంచినీటి పథకానికి నాణ్యత గల పైపులు వేయకపోవడంతో అన్ని గ్రామాలకు నీరు చేరడం లేదు. దీంతో పాటు విద్యుత్ సమస్య మంచినీటి పథకాలకు గుదిబండలా తయారైంది. గ్రామాల్లో గోస... పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి ఇలాకా అయిన అనుమల మండలంలో 32 హ్యాబిటేషన్లలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో అత్యధికంగా సంస్థాన్నారాయణ్పూర్ మం డలంలో 73 హ్యాబిటేషన్లలో మంచి నీటి ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత వరుసగా చౌటుప్పుల్ మండల పరిధిలో 24, చందంపేట-14, ఆత్మకూరు (ఎస్ )-30, మోతె-20, చివ్వెంల-37, సూర్యాపేట-23, దామరచర్ల-27, వేములపల్లి-20, మునగా ల-20, పెన్‌పహాడ్-30 గ్రామాల్లో నీటి ఎద్దడి జఠిలంగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు రూ.2.85 కోట్లు... నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నివారణ కోసం ప్రభుత్వానికి జిల్లా యం త్రాంగం రూ.2.85 కోట్లు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదనలు పం పింది. ఈ నిధులతో వేసవి నీటిఎద్దడి తీవ్రతరం కానున్న 532 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, అద్దెబోర్లు, బోరు బావుల మరమ్మతుల కోసమని ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయా పైసా విడుదల కాలేదు. అధికారుల వద్ద చిల్లగవ్వ లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే తప్ప ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. కానీ నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాని పరిస్థితి ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అధికారులు చెబుతున్నారు.