సాక్షి, అమరావతి: తాగునీటిలో అత్యంత సూక్ష్మస్థాయిలో దాగి ఉండే విషపూరిత కారకాలను ముందే పసిగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లను పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తోంది. సీసం, పాదరసం వంటి కొన్నిరకాల మూలకాలతో పాటు పురుగు మందుల అవశేషాలున్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించడంవల్ల క్యాన్సర్, కిడ్నీ సంబంధిత ప్రమాదకర రోగాల బారినపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్‌లలో ఇలాంటి ప్రమాదకర కారకాలను గుర్తించే సౌకర్యాల్లేవని అధికారులు తెలిపారు.
గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 112 ల్యాబ్‌లలో కేవలం ఫ్లోరైడ్, కాల్షియం, ఐరన్ వంటి 14 రకాల భారీ మూలకాలను మాత్రమే గుర్తించే వీలుంది. కానీ, అతి సూక్ష్మస్థాయిలోని ప్రమాదకర మూలకాలను, పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు లేదు. ఈ నేపథ్యంలో.. 70 రకాల అతిసూక్ష్మ మూలకాలతో పాటు 24 రకాల పురుగుమందుల అవశేషాలను గుర్తించగలిగేలా ఈ ల్యాబ్‌లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. తద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 10–15 రోజుల్లోనే ఆధునిక యంత్రాలను రాష్ట్రానికి పంపిస్తుందని అధికారులు తెలిపారు.
ఏలూరు ఘటనతో చర్యలు వేగవంతం
సాధారణంగా రైతులు పంటలపై పిచికారీ చేసిన పురుగు మందుల అవశేషాలు ఏదో ఒక రూపంలో నీటిలో కలిసిపోతుంటాయి. ఆ నీరే భూగర్భంలో ఇంకిపోవచ్చు.. లేదంటే సమీపంలో వాగులు వంకలతో పాటు అక్కడకు దగ్గరగా ఉండే సాగునీటి కాలువలలోనే కలిసే అవకాశం ఉంది. సాగునీటి కాల్వల ద్వారా పారే ఈ తరహా నీరు ఒక్కోసారి ప్రజల తాగునీటి అవసరాల కోసం ముందస్తుగా నీటిని నిల్వచేసే స్టోరేజీ ట్యాంకుల్లోనూ కలిసే అవకాశం ఉంటుంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పెద్ద సంఖ్యలో స్థానికులు అనారోగ్యానికి గురైన ఘటన ఈ కోవకు చెందిందే. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణుల బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి తాగునీటిలో సీసం, పాదరసం వంటి మూలకాలతోపాటు కొన్ని పురుగు మందుల అవశేషాలున్నట్లు గుర్తించింది. ఇదే విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తాగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ల ఆధునీకరణకు పూనుకుంది.
ముందుగా గోదావరి జిల్లాల్లో 4 ల్యాబ్‌లు..
ల్యాబ్‌ల ఆధునీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని నాలుగు ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఏలూరు ప్రాంతంలోని ఓ ల్యాబ్‌తో పాటు ఇదే జిల్లాలో ఆక్వాసాగు ఎక్కువగా ఉండే నరసాపురం డివిజన్ పాలకొల్లులో మరొకటి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని ల్యాబ్‌లనూ ఆధునీకరిస్తారు. వీటికి ఆధునిక నీటి పరీక్షల యంత్రాల సరఫరాతో పాటు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలను అమెరికాకు చెందిన ‘పెర్కిన్ ఎలయర్’ సంస్థకు అప్పగించారు. అక్టోబర్ 1 నుంచి వాటిల్లో అన్ని రకాల నాణ్యత పరీక్షలు మొదవుతాయని అ«ధికారులు వెల్లడించారు.
ఎగుమతులకు ముందు చేసే పరీక్షల్లాగే..
వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే ముందు వాటికి నాణ్యత పరీక్షలు చేయడం తప్పనిసరి. వాటిపై ఎలాంటి పురుగు మందుల అవశేషాల్లేవని నిర్ధారిస్తూ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే ఓడలో లోడింగ్‌కు అనుమతిస్తారు. ఈ తరహా పరీక్షలనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆధునీకరిస్తున్న ల్యాబ్‌లలో నిర్వహిస్తారు. ఇక్కడ ఒక్కో పరీక్షకు రూ.12 వేల చొప్పున ఫీజుగా చెల్లించాలి. ఏలూరు ఘటన సమయంలో హైదరాబాద్‌లో ఒక్కో శాంపిల్ పరీక్షకు రూ. 15 వేల చొప్పున ఫీజు చెల్లించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నిర్ణీత రుసుంకు ప్రైవేట్ వ్యాపారుల శాంపిల్స్‌ను కూడా పరీక్షించే ఆలోచన ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment