
మొద్దునిద్ర!
జిల్లాలో పంచాయతీరాజ్ విభాగం నిద్దరోతోంది. రెండున్నరేళ్ల క్రితం మంజూరైన రోడ్లను సైతం ఇప్పటికీ పూర్తిచేయకుండా కాలయాపన చేస్తోంది.
నత్తనడకన పీఎంజీఎస్‌వై పనులు
♦ రెండున్నరేళ్లుగా సాగుతున్న రోడ్ల నిర్మాణాలు
♦ 10 రహదారుల్లో పూర్తయింది ఒక్కటే..!
♦ పీఆర్ రహదారుల విభాగం నిర్లక్ష్యం
♦ నిధులు అందుబాటులో ఉన్నా నిరుపయోగం
♦ అధ్వానపు రోడ్లతో జనం ఇక్కట్లు
⇔ పథకం: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
⇔ మంజూరైన పనులు/సంవత్సరం: 10/201314
⇔ నిర్మించాల్సిన రహదారుల విస్తీర్ణం: 79.87 కి.మీ.
⇔ కేటాయించిన నిధులు: రూ.55.06 కోట్లు
⇔ ఇప్పటివరకు చేసిన ఖర్చు: రూ.7.38 కోట్లు
⇔ పూర్తయిన రోడ్ల విస్తీర్ణం: 5.85 కి.మీ.
జిల్లాలో పంచాయతీరాజ్ విభాగం నిద్దరోతోంది. రెండున్నరేళ్ల క్రితం మంజూరైన రోడ్లను సైతం ఇప్పటికీ పూర్తిచేయకుండా కాలయాపన చేస్తోంది. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే క్రమంలో తలపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 2013లో జిల్లాకు 10 రోడ్లు మంజూరయ్యాయి. కొత్తగా నిర్మించే ఈ 10 రోడ్లకుగాను కేంద్ర ప్రభుత్వం రూ.55.06 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 79.87 కిలోమీటర్ల మేర నూతన రహదారులను నిర్మించాల్సి ఉండగా.. 2014లో చర్యలకు ఉపక్రమించిన అధికారులు ఇప్పటివరకు 5.85 కిలోమీటర్ల రోడ్డును మాత్రమే పూర్తిచే యడాన్ని చూస్తే.. జిల్లా పంచాయతీరాజ్ రహదారుల విభాగం పనితీరు ఎలాఉందో స్పష్టమవుతోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అసుసంధానం చేస్తూ పీఎంజీఎస్‌వై కింద జిల్లాకు 2013-14 వార్షికంలో 10 రోడ్లు మంజూరయ్యాయి. బషీరాబాద్, చేవెళ్ల, ధారూరు, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, శంషాబాద్, యాచారం మండలాల్లో 10 రోడ్లను 79.87 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించేందుకు రూ. 55.06 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసిన పంచాయతీరాజ్ విభాగం పనుల పురోగతిపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో రెండున్నరేళ్లుగా ఈ రోడ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులకుగాను ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఇప్పటివరకు రూ.7.38కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఇటీవల జరిగిన నిఘా, పర్యవేక్షణ సమావే శంలో గణాంకాలు వెల్లడించారు. మహేశ్వరం -మన్‌సాన్‌పల్లి రోడ్డునుంచి కేబీ తండా, ఉప్పుగడ్డ తండా గ్రామాలకు కొత్త రోడ్డు 5.85 కిలోమీటర్ల మేర పనిని పూర్తిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
పనుల వారీగా పురోగతి పరిశీలిస్తే..
♦ బషీరాబాద్ మండలంలో టి01 పీడబ్ల్యూడీ రోడ్ నుంచి పర్వత్‌పల్లి, మర్పల్లి, జలాల్‌పూర్ గ్రామాలను అనుసంధానం చేసే 11.23 కిలోమీటర్ల రహదారి ఇప్పటికీ సగంలోనే ఉంది.
♦చేవెళ్ల- షాబాద్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వెంకటాపూర్, కందవాడ, నక్కలపల్లి గ్రామాలను కలిపే 11.14 కిలోమీటర్ల రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
♦ధారూరు మండలం మున్నూరుసోమారం, గడ్డమీదిగంగారంలను కలిపే 8.63 కిలోమీటర్ల బుగ్గ- కోట్‌పల్లి రోడ్డు పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి
♦కందుకూరు మండలం కటికపల్లి, బండమీదిగూడూరులను కలిపే రాచులూరు -గూడూరు రోడ్డు అభివృద్ధి పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
♦ కులక్కచర్ల- నవాబ్‌పేట్ రోడ్డులో మేగ్యానాయక్‌తండాకు వెళ్లే 7.80 కిలోమీటర్ల రోడ్డు పనులు బీటీ స్థాయికి చేరుకున్నాయి.
♦ కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ- మియాపూర్ 5.53 కిలోమీటర్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.
♦ శామీర్‌పేట్ మండలం అద్రాస్‌పల్లి -నారాయణపూర్ రోడ్డు పనులు 10.06 కిలోమీటర్ల మేర పనులు ఇంకా టెండరు ప్రక్రియకే పరిమితమయ్యాయి
♦ శంషాబాద్-కోళ్లపడకల్ పీడబ్ల్యూడీ రోడ్ నుంచి సంగిగూడ, చిన్నగోల్కొండ వెళ్లే రోడ్డు పనులు ఇంకా కాంట్రాక్టర్‌కు అప్పగించలేదు.
♦ యాచారం మండలం మాల్ నుంచి దాద్‌పల్లికి వెళ్లే 9.12 కిలోమీటర్ల రోడ్డు పనులు సగభాగమే పూర్తయ్యాయి.