ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు.
ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్‌లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి.
అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..
ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి.
కాంట్రాక్టు రద్దు చేశారా?
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
బిజినెస్ నిల్..
వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్..
కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం.
– శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి
రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే..
ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
– శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్
గత ప్రభుత్వ అశ్రద్ధతోనే..
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి.
– మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment