కరెంటుకు ఓకే.. | Power cut okay .. | Sakshi
Sakshi News home page

కరెంటుకు ఓకే..

Published Sun, Mar 2 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

కరెంటుకు ఓకే..

కరెంటుకు ఓకే..

  • పంచాయతీలు పరేషాన్
  •  జిల్లాలో 700 పంచాయతీలకు అందిన ఆదేశాలు
  •  నాడు బిల్లులు కట్టొద్దని జీవో.. నేడు చెల్లించాలని ఉత్తర్వులు
  •  సాక్షి, మచిలీపట్నం/ ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ యంత్రాంగం తీరుతో పంచాయతీలు పరేషాన్ అవుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించక్కర్లేదని గతంలో జీవో ఇస్తే.. ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ  పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో వినియోగించే కరెంటుకు బిల్లులు కట్టక్కర్లేదని గతంలో వెసులుబాటు ఇవ్వటంతో ఆ డబ్బుతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని పంచాయతీ పాలకవర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. బిల్లుల బకాయిలపై పంచాయతీలు, ట్రాన్స్‌కో అధికారులకు సైతం పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీలకు విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
     
    జిల్లాలో రూ.45 కోట్ల బకాయిలు...
     
    జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు సుమారు రూ.45 కోట్ల మేర కరెంటు బిల్లులు ట్రాన్స్‌కోకు బకాయిలు పడ్డాయి. వాటిలో 150 మేజర్ పంచాయతీలు రూ.12.26 కోట్లు బకాయిలు కాగా, 820 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.32.43 కోట్ల బిల్లు మొత్తాలను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలను ట్రాన్స్‌కోకు చెల్లించనక్కర్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం 2009 జనవరి 17న జీవో నంబరు 80ని జారీ చేసింది. దీంతో పంచాయతీల పాలకవర్గాలు కరెంటు బిల్లులు కట్టక్కర్లేకుండా ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భావించాయి.

    తాజాగా రెండు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కరెంటు బిల్లులు చెల్లించాలంటూ జిల్లా పంచాయతీ అధికారు(డీపీవో)లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా  పంచాయతీల సాధారణ నిధులు, 13వ ఆర్థిక సంఘం నిధులు, సర్‌చార్జ్, స్టాంపు డ్యూటీ నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించేలా పంచాయతీ నిధుల నుంచి తీసుకుని వెసులుబాటు కల్పించడంతో పంచాయతీల పాలకవర్గాలు ఆ దిశగా దృష్టి సారించాయి. దీంతో కరెంటు బిల్లుల వసూళ్లపై గ్రామ పంచాయతీలపై ట్రాన్స్‌కో ఒత్తిడి మొదలైంది.
     
    అన్ని పంచాయతీలకు సమాచారం : డీపీవో ఆనంద్
     
    జిల్లాలోని అన్ని పంచాయతీలకు పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అందించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కె.ఆనంద్ ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో ఏ పంచాయతీ ఎంత కరెంటు బిల్లు బకాయి ఉంది, వాటిని ఏ నిధుల నుంచి చెల్లించవచ్చు అనే పూర్తి సమాచారంతో ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఆయా నిధుల నుంచి పంచాయతీలు కరెంటు బకాయిలు తక్షణం చెల్లించాలని ఆయన సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement