గట్టెక్కేదెలా! | gattekkedelaa! | Sakshi
Sakshi News home page

గట్టెక్కేదెలా!

Published Thu, Feb 16 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

గట్టెక్కేదెలా!

గట్టెక్కేదెలా!

చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలు కార్యదర్శులకు గుదిబండగా మారాయి. మార్చి 15వ తేదీలోగా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు హుకుం జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక కార్యదర్శులు, సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. తలకు మించిన పనులతో ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు పన్నుల వసూలు సాధ్యం కావడం లేదు. పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలతో పాటు ఇతర పనులు కూడా చేయడం వల్ల పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టలేక పోతున్నారు. మరోవైపు ఒక్కొక్క కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు. పన్నులను తక్షణమే వసూలు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఈఓపీఆర్డీలు, డివిజన్‌ స్థాయి పంచాయతీ అధికారుల దీనిపైనే కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారు. మేజర్‌ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్‌తోపాటు కార్యాలయ సిబ్బందిని సైతం పన్నుల వసూలు కోసం కేటాయించారు. అయినా ఆశించినమేర వసూలు కావడం లేదని తెలుస్తోంది. 
 
పంచాయతీల్లో పోస్టులు ఖాళీ
జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో పాటు బిల్లు కలెక్టర్, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, కార్యదర్శుళు దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా పాలన కష్టంగా మారింది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులన్నీ కార్యదర్శులే చూడాలి. దీంతో వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్యదర్శి, బిల్లు కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తే పంచాయతీల్లో పాలన గాడిన పడుతుంది.
 
40 శాతం మించని వసూళ్లు
జిల్లాలో 48 మండలాల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 908 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నోటిఫైడ్‌ పంచాయతీలు 204, నా¯ŒS నోటిఫైడ్‌ పంచాయతీలు 704. డివిజన్‌ వారీగా చూస్తే ఒక్కొక్క డివిజన్‌లో ఇప్పటివరకు 40 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 177 పంచాయతీలు ఉండగా, రూ.10.50 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 34 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఏలూరు డివిజన్‌ పరిధిలో 272 పంచాయతీలు ఉండగా, రూ. 19.72 కోట్లకు గాను, 41శాతం మాత్రమే వసూలయ్యాయి. కొవ్వూరు డివిజన్‌ పరిధిలో 209 పంచాయతీలు ఉండగా, రూ.20.75 కోట్లకు గాను 41శాతం పన్నులు వసూలయ్యాయి. నరసాపురం డివిజన్‌ పరిధిలో 250 పంచాయతీలు ఉండగా, రూ.12.90 కోట్లకు గాను 45శాతం పన్నులు వసూలయ్యాయి. 34 శాతం మాత్రమే వసూలు చేసి జంగారెడ్డిగూడెం డివిజన్‌ చివరి స్థానంలో ఉంది. మార్చి 31 నాటికి పన్నులు వసూలు చేయాలంటే.. 44 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అధికారులతో సమావేశమై పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వేగవంతం చేశాం
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. గత ఏడాది 97శాతం వసూలు చేశాం. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకోసం అధికారులు , సిబ్బందిని అప్రమత్తం చేశాం.
– కె.సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement