ఎప్పుడిస్తారో తెలియని ‘ఆసరా’
* పింఛన్ల పంపిణీపై అంచనాల కమిటీ అసంతృప్తి
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ఎమ్మెల్యేల ఆక్షేపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఎప్పుడు అందుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, 36 లక్షలమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే విషయంలో స్పష్టమైన తేదీలను ప్రకటించ లేకపోవడం శోచనీయమని అంచనాల కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో అంచనాల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆసరా పింఛన్లు, పంచాయతీరాజ్ రహదారులు, ఉపాధిహామీ పనులు.. తదితర అంశాలపై సభ్యులు సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని సెర్ప్ సీఈవో పౌసమి బసును నిలదీశారు. ఆధార్ కార్డులో పేర్కొన్న వయసు ఆధారంగా వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారని, దీంతో లక్షలాదిమంది తమ వయసును మార్చుకొని అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని ఆమె ఆరోపించారు.
ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎంతోమంది అర్హులకు ఇప్పటికీ పింఛన్లు అందడం లేదన్నారు. సెర్ప్ సీఈవో స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలలో జాప్యం జరగడం వల్లే పింఛన్లను సకాలంలో అందజేయలేకపోతున్నామని వివరించారు. ఆధార్‌కార్డు వయసును పరిగణనలోకి తీసుకోవడం లేదని, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రతినెలా కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు.
30% ‘లెస్’ వేస్తుంటే ఏం చేస్తున్నారు?
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం బాగోలేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు 30 శాతం లెస్‌కు టెండర్లు వేస్తున్నారంటే ఎస్టిమేషన్స్ వేయడంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనుకోవాల్సి వస్తుందన్నారు. కేవలం కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసమే లెస్‌కు టెండర్ వేసి, ఆపై కాంట్రాక్టర్లు పనులను సరిగా చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖలో టెండర్లకు బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్ధారించిన విధంగా పంచాయతీరాజ్‌లోనూ 5 శాతం కన్నా తక్కువగా టెండర్‌వేస్తే సదరు సొమ్మును డిపాజిట్ చేయించుకోవాలని సూచించారు.
ఉపాధిహామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వ్యవసాయానికి కూడా ఉపాధిహామీని అనుసంధానం చేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని సూచిం చారు. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ కింద చేపట్టిన స్కీమ్‌లకు సకాలంలో సొమ్ము చెల్లించక రైతులు అవస్థలు పడుతున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులున్నారు.