ఆగని నిరసన | peoples are concern on asara scheme | Sakshi
Sakshi News home page

ఆగని నిరసన

Published Tue, Dec 16 2014 2:53 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

peoples are concern on asara scheme

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆసరా’ పథకం తమకు అందడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం కూడా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగించారు. నిజామాబాద్, ఆర్మూ రు, బోధన్, కామారెడ్డి డివిజన్లలో అర్హత  కోల్పోయిన పలువురు రోడ్లెక్కారు. అధికారులు ఈ నెల పది నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించిన విషయం విదితమే. చివరి రోజైన సోమవారం నాటికి మొత్తం 2,03,868 మందికి నవంబర్, డిసెంబర్ నెలలకు చెందిన పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

మొదటి రోజే బాలారిష్టాలు తప్పలేదు. ఆ రోజు, మొత్తం 2,03,886 మంది లబ్ధిదారులకుగాను 21,157 మందికే రూ.4.42 కోట్లు అందజేశారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పంపిణీలో వేగం పెంచారు. అయినా, సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వేలాది మంది దరఖాస్తులతో తరలిరావడంతో నగరం జాతరను తలపించింది.

తేలని అర్హుల జాబితా
పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆద్యంతం ఆందోళనలకు కారణమవుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో చాలా మంది ఈసారి అవకాశం కోల్పోయా రు. ఈ నేపథ్యంలో జనం రోడ్లెక్కారు. నిజామాబా ద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల ఎదుట ధర్నాకు దిగారు. పలుచోట్ల వృద్ధులు, మహిళలు, వికలాంగులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘ఆసరా’ కింద మొత్తం 3,62,166 దరఖాస్తులు రాగా, అందులో 2,03,868 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఫించన్ల జాబితాలో పేర్లు లేని వారందరూ ఆందోళనబాట పట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్‌ను ముట్టడించిన వృద్ధులు, వికలాంగులు అనంతరం ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బోధన్ మున్సిపల్ కమిషనర్ డీవీవీ ప్రసాదరావును నిలదీశారు. బోధన్ పట్టణంలో పలు వార్డులకు సంబంధించిన తమ పేర్లు పింఛన్ జాబితాలో లేవని అధికారులను ప్రశ్నించారు. ఆర్మూరు మున్సిపాలిటీ ఎదుట ఫించన్ల కోసం చేపట్టిన దీక్షలు ఆరవ రోజుకు చేరాయి.

ఎంపీడీఓ, తహసీల్‌దారు కార్యాలయాల ఎదుట
మున్సిపాలిటీలతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపీడీఓ, తహసీల్‌దారు కార్యాల యాల ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఇందులో అత్యధికంగా వృ ద్దులు, వికాలాంగులు పాల్గొన్నారు. బోధన్‌లో హుస్సా, మందారా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. బాల్కొండ మండలం ముప్కాల్, రెంజర్లలో పంపిణీ కా వల్సిన పింఛన్లకు సంబంధించి నగదు కొరత ఏర్పడింది. గ్రామ పంచాయతీల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూర్‌కు చెం దిన అనేక మంది పింఛన్లు రావడం లేదంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ఫించన్ల కోసం తరచుగా అర్హులైన లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రం లో వృద్ధులు ధర్నా చేశారు. కోటగిరిలోనూ ఆందోళన చేశారు. పింఛన్లు రాలేదం టూ ధర్పల్లి మండల మండల కార్యాలయాన్ని ముట్టడించారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సదాశివనగర్ మండలాల తహసీల్‌దారు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలను సమర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీల వద్దా నిరసనలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement