8 స్థానిక సంస్థలకు పురస్కారాలు
- లక్నోలో 24న ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’
- అవార్డులు అందజేయనున్న యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రి తోమర్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుపనున్నారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు రాష్ట్రం నుంచి 8 స్థానిక సంస్థలు ఎంపికయ్యాయి. లక్నోలోని రాం మనోహర్ లోహియా నేషనల్ యూనివర్సిటీలో సోమవారం జరగనున్న అవార్డుల ప్రదాన కార్యక్రమానికి కేంద్ర మంత్రి తోమర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్‌కు ఎంపికైన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మీయాదమ్మకు యూపీ సీఎం అవార్డును అందజేయనున్నారు.
అలాగే పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలను కేంద్ర మంత్రి తోమర్ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ తుల ఉమ, వనపర్తి జిల్లా ఘనపూర్, వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిషత్‌ల అధ్యక్షులు(ఎంపీపీ) కె.కృష్ణానాయక్, కొందురు శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్ నీరడి భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, గోపాల్‌రావుపల్లి గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి రాంరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామ సర్పంచ్ జి.ఇంద్రయ్య అందుకోనున్నారు. పురస్కారాలకు ఎంపికైన జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతులను కేంద్రం ఇవ్వనుంది. పంచాయతీరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ లక్నో వెళ్లనున్నారు.