Union Minister Tomar
-
గనులేమీ అక్షయ పాత్రలు కావు!
సాక్షి, హైదరాబాద్: గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులు, ఖనిజాలు సంపద సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని.. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యాన్ని కొనలేమన్న విష యం గుర్తెరగాలని మైనింగ్ వ్యాపారస్తులకు సూచించారు. గని కార్మికులు యంత్రాలు కాదని.. వారి రక్షణ, ఆరోగ్యం ప్రధాన అంశంగా ఉండాలన్నారు. గనుల ప్రభావిత ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(డీఎంఎఫ్) ప్రాజెక్టు ను పారదర్శకంగా అమలు చేస్తే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తప్పనిసరిగా పునరావాసం కల్పించాలని చెప్పారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 సున్నపు రాయి బ్లాక్‌లు వేలానికి రానున్నాయని, వేలంలో సమస్యలొస్తే అర్ధరాత్రి ఒంటి కాలిమీద నిలబడి సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. డీఎంఎఫ్ కింద ఇప్పటికే మైనింగ్ జరిగే జిల్లాలకు రూ.1,300 కోట్లు విడుదలయ్యాయని, తెలంగాణకూ రూ.1,300 కోట్లు వచ్చాయని తెలిపారు. ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఖాయం: కేటీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఖాయమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు లేవని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో సున్నపు రాయి గనుల అన్వేషణ 3 నెలల్లో పూర్తవుతుందని, త్వరలో వేలానికి వెళ్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫోన్ చేస్తే ఇంటికి ఇసుక సరఫరా చేసేలా సాండ్ ట్యాక్సీల విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. 2016–17లో గనుల ద్వారా రాష్ట్రానికి రూ.3,170 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఈ ఏడాది రూ.3,500 కోట్లకు పెరగనుందని చెప్పారు. గనుల తవ్వకాల నియంత్రణకు జియో ట్యాగింగ్, జియో మ్యాపింగ్, డ్రోన్లను సైతం వినియోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మైనింగ్ రంగం చోదకశక్తిగా పరిగణిస్తామని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకునే మైనింగ్ నిర్వహించాలని సూచించారు. -
8 స్థానిక సంస్థలకు పురస్కారాలు
- లక్నోలో 24న ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ - అవార్డులు అందజేయనున్న యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రి తోమర్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుపనున్నారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు రాష్ట్రం నుంచి 8 స్థానిక సంస్థలు ఎంపికయ్యాయి. లక్నోలోని రాం మనోహర్ లోహియా నేషనల్ యూనివర్సిటీలో సోమవారం జరగనున్న అవార్డుల ప్రదాన కార్యక్రమానికి కేంద్ర మంత్రి తోమర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్‌కు ఎంపికైన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మీయాదమ్మకు యూపీ సీఎం అవార్డును అందజేయనున్నారు. అలాగే పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలను కేంద్ర మంత్రి తోమర్ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ తుల ఉమ, వనపర్తి జిల్లా ఘనపూర్, వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిషత్‌ల అధ్యక్షులు(ఎంపీపీ) కె.కృష్ణానాయక్, కొందురు శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్ నీరడి భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, గోపాల్రావుపల్లి గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి రాంరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామ సర్పంచ్ జి.ఇంద్రయ్య అందుకోనున్నారు. పురస్కారాలకు ఎంపికైన జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతులను కేంద్రం ఇవ్వనుంది. పంచాయతీరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ లక్నో వెళ్లనున్నారు. -
విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం స్థిరీకరించాలి
కేంద్ర ఉక్కు మంత్రి తోమర్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విస్తరణ, ఆధునీకరణ వల్ల విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మెరుగైన లాభాలు సాధించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తిలో అవాంతరాలు, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలన్నారు. కేంద్రమంత్రి తోమర్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కోక్ ఓవెన్ బ్యాటరీ, బ్లాస్ట్‌ఫర్నేస్ 3, స్టీల్‌మెటల్ షాప్-2, వైర్‌రాడ్ మిల్-2లను సందర్శించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ విస్తరణ, ఆధునీకరణ, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఇంధన పొదుపు తదితర చర్యలు స్టీల్‌ప్లాంట్ లాభాలపై గణనీయంగా సానుకూల ప్రభావం చూపించాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని స్థిరీకరించాలని ఆదేశించారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు, కేంద్ర ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి ఊర్‌విల్ల ఖతిలతోపాటు స్లీట్‌ప్లాంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.