ఉద్యోగులకు గృహ రుణాలు డబుల్
- పీఆర్సీ సిఫారసులకు సర్కారు ఆమోదం
- రుణ మొత్తాలు, వడ్డీ రేట్ల వివరాలతో ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి నిర్మాణ రుణాలను దాదాపు రెండింతలకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో పెరిగిన రుణ మొత్తాల వివరాలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించాల్సిన వ్యవధి తదితర వివరాలను కూడా వెల్లడించింది. కొత్త ఇంటి నిర్మాణం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించి రూ.26,600 వరకు మూల వేతనమున్న ఉద్యోగులకు రూ.10 లక్షలు, రూ.26,600 నుంచి రూ.42,490 మధ్య వేతనమున్న వారికి రూ.12.30 లక్షలు, రూ.42,490 నుంచి రూ.61,450 మధ్య వేతనమున్న ఉద్యోగులకు రూ.15 లక్షలు, రూ.61,450 కన్నా ఎక్కువగా వేతనం అందుకునే వారికి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది.
మూల వేతనంపై 72 రెట్లు లేదా ఈ నిర్దేశిత మొత్తంలో ఏది తక్కువగా ఉంటే అంతమేరకు రుణంగా అందిస్తారు. అదే రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులకు రూ.20 లక్షలు లేదా మూల వేతనానికి 50 రెట్లు.. ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం రుణం తీసుకునే వీలుంటుంది. గృహ రుణాలకు సంబంధించి నాలుగో తరగతి ఉద్యోగులకు 5 శాతం, ఇతర ఉద్యోగులకు 5.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులు 300 నెలసరి వాయిదాల్లో వడ్డీ సహా రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఇళ్లకే కాకుండా ప్రస్తుతమున్న ఇళ్ల మరమ్మతులు లేదా విస్తరణకు, ఇంటి స్థలం కొనుగోలుకు సైతం ఉద్యోగులు అడ్వాన్సులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఉద్యోగులు బేసిక్‌పై 20 రెట్లు లేదా రూ. 4 లక్షలు.. ఏది తక్కువైతే అంతమొత్తం అడ్వాన్సుగా పొందే వీలుంటుంది. 90 నెలసరి వాయిదాల్లో ఈ అడ్వాన్సును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటి స్థలం కొనుగోలుకు రూ.2 లక్షలు లేదా బేసిక్‌పై పది రెట్లు.. ఏది తక్కువైతే అంత మొత్తం రుణంగా ఇస్తారు. దీనిని 72 నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించినా, అసలు వినియోగించకపోయినా వడ్డీ రేటును రెండింతలు వసూలు చేస్తారు.
రుణ వినియోగానికి సంబంధించి నిబంధనలను పాటించకపోతే ఒకటిన్నర రెట్లు వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులతో పాటు అఖిల భారత సర్వీసుల అధికారులకు ఇళ్ల రుణాలు మంజూరీకి అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఈసారి కూడా పంచాయతీరాజ్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ సదుపాయాన్ని కల్పించలేదు.