
సర్కారు సొమ్మేగా.. ఖతం చేద్దాం !
పరిపాలన సౌలభ్యంలో భాగంగా రేగోడ్‌కు ఐదు నెలల క్రితం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం మంజూరైంది.
పరిపాలన సౌలభ్యంలో భాగంగా రేగోడ్‌కు ఐదు నెలల క్రితం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం మంజూరైంది. దీనిని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఖాళీగా ఉన్న మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా భవన ఆవరణలో అడ్డుగా ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను తొలగించి ఓ పక్కకు వేశారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం ఆ వెంటనే కార్యాలయాన్ని జోగిపేటకు తరలించడం జరిగిపోయింది. ఈ క్రమంలో మహిళా సమాఖ్య భవన ఆవరణలో ఉన్న ఖరీదైన బండరాళ్లపై కొందరి కళ్లు పడ్డాయి.
ఇంకేముంది ఓ బడా రాజకీయ నాయకుడు, అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా బండ రాళ్లను కొట్టించి అల్లాదుర్గం మండలంలోని వట్‌పల్లికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలపడంతోనే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. బండ రాళ్లను వేళం వేసి.. వచ్చిన డ బ్బును ప్రజా అవసరాలకు వెచ్చిస్తే బాగుండేదని, జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన ఓ సీనీయర్ నేత వద్ద ఆదివారం బండరాళ్ల విషయం ప్రస్తావించగా రాళ్లు కొడుతున్న విషయం తనకు తెలియదని.. తెలుసుకుంటాని పేర్కొన్నారు.
నా దృష్టికి రాలేదు
మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో ఉన్న బండ రాళ్లను ముక్కలుగా(కొడుతున్న) చేస్తున్న విషయం నాకు తెలియదు. బహుశా రెండు రోజుల నుంచి కొడుతున్నారేమో. రాళ్లను కొట్టడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్