నిధులు పొంగాయి నీళ్లే పారాలి!
సాగునీటి పారుదల శాఖకు 25,000కోట్లు
ప్రణాళిక బడ్జెట్ కింద 25 వేల కోట్ల కేటాయింపు
* మొత్తంగా రూ.26,625.32 కోట్లు
* పాలమూరు, ప్రాణహిత, సీతారామ ప్రాజెక్టులకు పెద్దపీట
* పాలమూరుకు రూ.7,861 కోట్లు, కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు, భక్తరామదాసు, సీతారామకు రూ.1151 కోట్లు
* మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులకు భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగానికి నిధులు పొంగాయి! ముందునుంచి చెబుతున్నట్లుగానే 2016-17 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు ప్రణాళికా వ్యయం కిందే మొత్తంగా రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేశారు.
గతేడాది ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కన్నా సుమారు రూ.15 వేల కోట్లు అధికంగా కేటాయించి సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. టెండర్ల దశను దాటి పనులకు సిద్ధమవుతున్న పాలమూరు-రంగారెడ్డి, రీ డిజైన్ పూర్తయి ఇటీవల మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న ప్రాణహిత-కాళేశ్వరం, కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేసిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.15 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక వీటితోపాటే తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికమంత్రి ఈటల.. ఇతర ప్రాజెక్టులకూ ఊపిరి పోసేలా నిధుల కేటాయించారు.
ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి సాగునీటి రంగానికి బడ్జెట్‌లో మొత్తంగా రూ.26,625.32 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.23,893.66 కోట్లు, చిన్ననీటి పారుదలకు రూ.2,452.52 కోట్లు కేటాయించారు. పరీవాహక అభివృద్ధి విభాగానికి రూ.30.14 కోట్లు, వరద నిర్వహణకు రూ.249 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కలుపుకొని ప్రాజెక్టుల కింద 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా కదులుతున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రాజెక్టు పరిధిలో పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించింది.
కరువు జిల్లాకు కావాల్సినంత
కరువు, వలసలతో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాలో సాగునీటిని పారించేందుకు కావాల్సినన్ని నిధులు కేటాయించారు. గత ఏడాదే శంకుస్థాపనకు నోచుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గతేడాది బడ్జెట్‌లో రూ.100 కోట్ల నిధులే కేటాయించారు. ఈ ఏడాది ఏకంగా రూ.7,861 కోట్లు కేటాయించారు. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొలి ఏడాదే సుమారు 30 శాతం నిధులు కేటాయించడం గమనార్హం.
ఇక జిల్లాలోని నాలుగు ప్రధాన భారీ, మధ్య తరహా ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 70 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగంలోకి వస్తుండటం, వీటితో వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 4 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలు ఉండడం, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, సహాయ పునరావాసం అంశాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం భారీ కేటాయింపులకు మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తంగా రూ.950 కోట్ల వరకు అవసరం ఉండగా రూ.600 కోట్ల వరకు కేటాయించారు.
భారీ ప్రాజెక్టులకు అంతే భారీగా
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులకు అంతే భారీస్థాయిలో కేటాయింపులు చేశారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులకు కలిపి రూ.1,151 కోట్ల మేర నిధులు కేటాయించారు. వచ్చే జూన్ నాటికి పూర్తి ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల్లో ఉన్న దేవాదులకు రూ.695 కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.505 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు రూ.1,417 కోట్ల మేర కేటాయింపులు చేశారు.
టన్నెల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో గతేడాది ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు చేస్తే.. ఈ ఏడాది రెట్టింపు చేశారు. ఇక అంతర్రాష్ట్ర వివాదాలకు పరిష్కారం దొరికిన దిగువ పెన్‌గంగకు రూ.124 కోట్లు కేటాయించగా, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ఆధునీకరణకు కలిపి మొత్తంగా రూ.660 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ఎస్సారెస్పీ-1, 2లకు రూ.300 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులకు తగినన్ని నిధుల కేటాయించారు.
ప్రాణహిత, కాళేశ్వరానికి విడివిడిగా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలకు బడ్జెట్‌లో విడివిడిగా కేటాయింపులు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసిన ప్రాణహితకు రూ.685 కోట్లు కేటాయించగా.. కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు రూ.6,971 కోట్లు కేటాయించారు. గడిచిన ఆరేళ్లలో ఈ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారో దానికి సమానంగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఉండటం విశేషం. రెండేళ్లలో మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణం పూర్తి, ఆయకట్టులో కనీసం 2 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో కేటాయింపులు పెరిగాయి.