ఆస్పత్రులకు టానిక్
* బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ.5,966.88కోట్లు
* గత ఏడాదికన్నా రూ.వెయ్యి కోట్లు అదనంగా కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణతోపాటు కొత్తగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 2016-17 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,966.88కోట్ల మేర ప్రతిపాదించింది. ఇందులో ప్రణాళిక కింద రూ.2,462.83కోట్లు, ప్రణాళికేతర బడ్జెట్ రూ.3,504.05కోట్లు చూపారు. మొత్తంగా వైద్యారోగ్యశాఖకు గతేడాది కంటే రూ.1,036 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్ మాత్రం గత ఏడాదితో ప్రణాళిక బడ్జెట్‌తో దాదాపు సమానంగా ఉండడం గమనార్హం.
హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, 40 చోట్ల డయాలసిస్ కేంద్రాలు, మరో 40 చోట్ల డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు, ఉన్న వాటిని మార్చడానికి రూ.600కోట్లు కేటాయించారు. డయాగ్నస్టిక్ పరికరాలు, పాత పడకల మార్పు, సివిల్ పనుల మరమ్మతులకు రూ.316కోట్లు ఇచ్చారు. ఔషధాలు తదితరాల కోసం రూ.225కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం, సేవలకు రూ.100 కోట్లు కేటాయించారు.
ఆరోగ్యశ్రీకి రూ.464కోట్లు
వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగానికి గతేడాది కంటే తక్కువగా రూ.784.87కోట్లు కేటాయించారు. ఈ విభాగంలో భాగంగా ఉన్న ఆరోగ్యశ్రీకి రూ.344 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి మరో రూ.120కోట్లు ప్రతిపాదించారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.189కోట్లు కేటాయించారు. బోధనాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు రూ.20కోట్లు, కాలేజీలు, ఆసుపత్రుల్లో వాహనాల కొనుగోలుకు రూ.6కోట్లు, విభాగంలో మానవ వనరుల అభివృద్ధికి రూ.26.75కోట్లు కేటాయించారు.108, 104 సర్వీసుల మెరుగుకు చర్యలు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని విభాగాలకు గత బడ్జెట్‌లో రూ.1,218.19 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 1,137.69 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో కీలకంగా 108, 104 సర్వీసులకు కొత్త వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.49కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను బాధితుల సొంతూళ్లకు తరలించేందుకు ఉచిత వాహన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం బడ్జెట్లో రూ.5కోట్లు కేటాయించారు. కొత్తగా పుట్టిన శిశువులకు కిట్లు అందజేసేందుకు రూ.3కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు.
వైద్యారోగ్య శాఖకు ముఖ్య కేటాయింపులు
⇒ మెడికల్ కాలేజీల్లో పరిశోధనకు రూ.12 కోట్లు
⇒ ఆయుష్ కాలేజీ బలోపేతానికి రూ.8.10 కోట్లు
⇒ పీహెచ్‌సీల స్థాయి పెంపునకు రూ.68 కోట్లు
⇒ 24 గంటల పీహెచ్‌సీలుగా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లు
⇒ భవనాల నిర్మాణానికి రూ.20కోట్లు