మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్‌లో రూ. 1,552 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్‌లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్‌లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు.
సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్‌వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు.
ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం.