‘సంపూర్ణ’ ఆరోగ్యం CM YS Jagan Comments On YSR Sampoorna Poshana program | Sakshi
Sakshi News home page

‘సంపూర్ణ’ ఆరోగ్యం

Published Thu, Aug 3 2023 3:28 AM

CM YS Jagan Comments On YSR Sampoorna Poshana program - Sakshi

సాక్షి, అమరావతి: ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలను మరింత బలో­పేతం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. డబ్బులకు వెనుకాడ­కుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహా­రాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డ్రై రేషన్‌ కింద అందించే సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదే­శించారు.

ఫౌండేషన్‌ స్కూళ్లలో చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి  ఆంగ్ల భాషలో పరి­జ్ఞానం, ఉచ్చారణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకో­వా­లని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా వ్యయం
రక్తహీనత, పౌష్టికాహారలేమి రాష్ట్రంలో పూర్తి తొలగిపోవాలనే లక్ష్యంతో భారీ ఖర్చు గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 –  రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏటా సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు.

పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్‌ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహార లేమి లాంటి సమస్యలు రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 

ఫ్యామిలీ డాక్టర్లు అంగన్‌వాడీల సందర్శన తప్పనిసరి
ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు.

బాలికా విద్య ప్రోత్సాహ పథకాలపై అవగాహన
బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు ఎలా ఉపయోగపడతాయో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా పథకాలు బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తాయో వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన అందుకే విధించామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

అంగన్‌వాడీల్లో పరిశుభ్ర వాతావరణం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు.

చిన్నారులకు బోధనలో నాణ్యతకు పెద్దపీట
ఫౌండేషన్‌ స్కూల్‌ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఫౌండేషన్‌ స్కూల్‌ (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫోనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా విధానాలతో నేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. 

పునాది బాగుంటే పై తరగతుల్లో సాఫీగా
చిన్నారులకు మూడో తరగతి నుంచే టోఫెల్‌ పరీక్షకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలైందని సీఎం జగన్‌ చెప్పారు. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు గరిష్టంగా వికసించే వయసు కాబట్టి వినూత్న బోధనా విధానాల ద్వారా మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాది గట్టిగా ఉంటే పై తరగతుల్లో విద్యార్థుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. మాంటిస్సోరి విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ చర్చించారు.

అధికారులు తొలుత మాంటిస్సోరి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ ఎండీ ఏ.బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఏ.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్‌ సరుకులు
– 2 కిలోలు రాగి పిండి
– 1 కేజీ అటుకులు
– 250 గ్రాముల బెల్లం
– 250 గ్రాముల చిక్కీ
– 250 గ్రాముల ఎండు ఖర్జూరం
– 3 కేజీల బియ్యం
– 1 కేజీ పప్పు
– అర లీటర్‌ వంటనూనె
– 25 గుడ్లు
– 5 లీటర్ల పాలు 

వైఎస్సార్‌  సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్‌ సరుకులు
– 1 కేజీ రాగి పిండి
– 2 కిలోలు మల్టీ గ్రెయిన్‌ ఆటా
– 500 గ్రాముల బెల్లం
– 500 గ్రాముల చిక్కీ
– 500 గ్రాముల ఎండు ఖర్జూరం
– 3 కేజీల బియ్యం
– 1 కేజీ పప్పు
– అర లీటరు వంటనూనె
– 25 గుడ్లు
– 5 లీటర్ల పాలు   

Advertisement
 
Advertisement
 
Advertisement