సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం.
కలెక్టరేట్ వేదికగా వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు.
పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్‌లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్‌లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment