YSR Sampoorna Poshana
-
‘సంపూర్ణ’ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. డబ్బులకు వెనుకాడకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ స్కూళ్లలో చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం, ఉచ్చారణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా వ్యయం రక్తహీనత, పౌష్టికాహారలేమి రాష్ట్రంలో పూర్తి తొలగిపోవాలనే లక్ష్యంతో భారీ ఖర్చు గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 – రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏటా సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహార లేమి లాంటి సమస్యలు రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్లు అంగన్వాడీల సందర్శన తప్పనిసరి ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు. బాలికా విద్య ప్రోత్సాహ పథకాలపై అవగాహన బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు ఎలా ఉపయోగపడతాయో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలు బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తాయో వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన అందుకే విధించామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీల్లో పరిశుభ్ర వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు బోధనలో నాణ్యతకు పెద్దపీట ఫౌండేషన్ స్కూల్ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూల్ (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫోనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా విధానాలతో నేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పునాది బాగుంటే పై తరగతుల్లో సాఫీగా చిన్నారులకు మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలైందని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు గరిష్టంగా వికసించే వయసు కాబట్టి వినూత్న బోధనా విధానాల ద్వారా మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాది గట్టిగా ఉంటే పై తరగతుల్లో విద్యార్థుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. మాంటిస్సోరి విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. అధికారులు తొలుత మాంటిస్సోరి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ ఏ.బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు – 2 కిలోలు రాగి పిండి – 1 కేజీ అటుకులు – 250 గ్రాముల బెల్లం – 250 గ్రాముల చిక్కీ – 250 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటర్ వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకులు – 1 కేజీ రాగి పిండి – 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా – 500 గ్రాముల బెల్లం – 500 గ్రాముల చిక్కీ – 500 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటరు వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు -
వైఎస్సార్ సంపూర్ణ పోషణ అందజేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వినూత్న బోధనా పద్ధతులపై దృష్టి పెట్టండి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశామని, నిధులకు వెనుకాడకుండా.. ఏరాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో ఆయన స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష ప్రారంభానికి ముందు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్‌హోం రేషన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రేషన్ సరుకులను స్వయంగా పరిశీలించి.. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్లను అందజేశారు. ఇక సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలి. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలి. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి. దీనికోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలి. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలి. ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలి అని అధికారులకు సూచించారాయన. బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతిదీవెన, విద్యా దీవెన ఏరకంగా ఉపయోగపడతాయన్నదానిపై బాగా అవగాహన కల్పించాలి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కూడా ఏ రకంగా బాల్యవివాహాలను నిరోధిస్తుందో కూడా వారికి వివరించాలి. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనను అందుకే పెట్టాం. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనికోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాలకు నిర్వహించే మరమ్మతుల్లో ముందుగా టాయిలెట్ల మరమ్మతును ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఫౌండేషన్ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలనుకూడా పరిశీలించాలి. ఇప్పుడు మనం నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంగ్లిషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలి. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో పునాదిగట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖపైనా సీఎం జగన్ సమీక్షలో మంత్రి ఉషాశ్రీచరణ్, సంబంధిత విభాగపు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
తల్లికి ‘సంపూర్ణ’ పోషణ.. ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం
కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల అందిస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్ జగన్ సర్కార్ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. (చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!) పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు అనుగుణంగా.. ఫోర్టిఫైడ్ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్ ఏ, విటమిన్ బీ 12, ఫొలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల మేరకు జగన్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. (చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు) రక్తహీనతను తగ్గిస్తుంది ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం ►ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి ►దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ ►క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలి ►దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం ►స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం ►సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి ►కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి ►ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్‌కు తగిన తర్ఫీదు ఇవ్వాలి ►క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి ►చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ►తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం ►అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు ►స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ►సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ►తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి ►క్రమం తప్పకుండా ఇలా ఆడిట్ చేయాలి ►ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలి ►నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి ►నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు ►గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలి ►అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ►స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ►దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’కు నీతి ఆయోగ్ ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణులు, పాలిచ్చే స్త్రీలు, ఆరు నుంచి 36 నెలల వయసున్న చిన్నారుల్లో పోషకాహార లోపాల్ని అధిగమించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ను నీతి ఆయోగ్ ప్రశంసించింది. సమయానుకూలంగా పోషకాహార లక్ష్యాల్ని చేరుకోవడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన టేక్‌హోమ్ రేషన్ కార్యక్రమాల్లోని వినూత్న పద్ధతులను సంకలనం చేస్తూ నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఏటా రెండు శాతం పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన జాతీయ పోషకాహార మిషన్ (పోషణ్ అభియాన్) 2.0ను సమర్థంగా వినియోగించి టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రాల ఉదాహరణలు, నమూనాలతో ప్రేరణ పొందడానికి ఈ నివేదిక ఉపకరిస్తుందని పేర్కొంది. నిజానికి.. టేక్ హోమ్ రేషన్ ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండడంతోపాటు లబ్ధిదారుల పోషకాహార అవసరాలు తీర్చేలా ఉండాలి. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో బాలామృతం, పాలు, గుడ్లు అందించడాన్ని ఉత్తమ పద్ధతిగా అభివర్ణించింది. టీహెచ్ఆర్ మెనూలో లబ్ధిదారుల అదనపు ఎంపికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవకాశమిస్తున్నాయని తెలిపింది. ఇక టీహెచ్ఆర్లో కీలకాంశమైన పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను అందిపుచ్చుకుందని తెలిపింది. అలాగే, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి చేసిన స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాఫ్ట్వేర్ బహుళ విధాలుగా ఉపయోగపడుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. అంతేకాక.. వైఎస్సార్ సంపూర్ణ పోషణలో డేటా ఎంట్రీ, ప్రొసెసింగ్, వాలిడేషన్ తదితర అంశాలనూ నివేదికలో వివరించింది. -
AP: రోజుకో రకం బలమైన ఆహారం
సాక్షి, అమరావతి : ఏ రోజుకా రోజు వేడివేడి అన్నం.. ఆకుకూర, దోసకాయ, టొమాటో, బీరకాయలతో ఏదో ఒక పప్పు.. కూరగాయలతో సాంబారు, మునగాకు, పాలకూర.. తల్లులకు కోడిగుడ్డు కూర 200 మిల్లీలీటర్ల పాలు.. పిల్లలకు ఉడికించిన కోడిగుడ్డుతో పాటు 100 మిల్లీలీటర్ల పాలు.. ఇవికాక ప్రతి మంగళవారం పిల్లలకు పులిహోర, గురువారం తల్లులకు ఎగ్‌ఫ్రైడ్ రైస్, పిల్లలు, తల్లులకు ప్రతి శనివారం వెజిటబుల్ రైస్.. ఇదేదో ధనవంతులు ఇళ్లలో తినే ఆహారం కాదు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌లో అందిస్తున్న మెనూ. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ అట్టాడ సిరి ఇందుకు సంబంధించిన మెనూ ఛార్ట్‌ను గురువారం విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గోరుముద్ద తరహాలో బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలని నిర్ణయించి ఈ మెనూ ఛార్ట్‌ను రూపొందించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి ఇంటి వద్దకే పోషకాహార పంపిణీ అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 1 నుంచి గర్భవతులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు ప్రీ స్కూల్ విద్యార్థులకు వేడివేడిగా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం దోహదం చేస్తుందని డాక్టర్ సిరి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 31,85,359 మంది, ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా 3,49,228 మంది చొప్పున మొత్తం 35,34,587 మంది లబ్ధిపొందుతున్నారు. -
సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
పార్వతీపురం టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు. గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’ గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం... ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. మెనూ ఇది.. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు. మా బాబు బరువు పెరిగాడు.. మా బాబు చాలా తక్కువ బరువు ఉండేవాడు. మొదటి సంవత్సరం మా అబ్బాయి బరువు 8 కేజీ లు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు తదితర బలవర్ధక పదార్థాలతో ఏడాదిన్నర కాలంలో 11 కేజీలకు బరువు పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్య ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి మాలాంటి తల్లుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దివ్య, పాలకొండ మండలం, బుప్పూరు పౌష్టికాహారంతో ఆరోగ్యం గర్భిణిగా మూడో నెలనుంచి మాకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పథకం కింద పౌష్టికాహారం తీసుకుంటున్నా ను. ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే వివిధ రకాల పోషకాహార వస్తువులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నాను. – దీప్తి పండా, పార్వతీపురం పట్టణం జిల్లాలో 15,601 మందికి లబ్ధి జిల్లాలోని 15 మండలాల్లో ని గర్భిణులు, బాలింతలు 15,601 మందికి లబ్ధి చేకూరుతోంది. గర్భిణుల కు మూడోనెల నుంచి ప్రసవించేవరకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ పోషణ కిట్లతో పాటు ఐరన్ మాత్రలు తీసుకున్న వారిలో 9 శాతం ఉన్న హిమోగ్లోబిన్ 11 శాతాని కి పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు. – వరహాలు, పీడీ ఐసీడీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా -
వైఎస్సార్ సంపూర్ణ పోషణకు శ్రీకారం
-
సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
తల్లులకు పోషణ.. పిల్లలకు రక్షణ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేటి బాలలే రేపటి పౌరులని.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ చాలా అవసరమని తెలిపారు. (చదవండి: జగన్ పాలనపై వంద శాతం సంతృప్తి) ‘‘గర్భిణీల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చాం. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయని’ సీఎం తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద 26.36లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.307.55 కోట్లు కేటాయించామన్నారు. మొత్తంగా సుమారు రూ.1863 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ఇవాళ ప్రారంభిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు. ♦గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు. వారికి ఏం చేయాలన్నది కూడా ఆలోచించలేదు. హెల్తీ బాడీ. హెల్తీ మైండ్. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు. ♦చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది. ♦మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ♦నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు. పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు. ♦పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ♦వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. ♦31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు. ♦17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు. ♦ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ♦ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు. ♦ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి ♦ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం ఈ పథకాలు. ♦55607 అంగన్వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం. ♦బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు కూడా అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం. ♦పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్ మీడియంలో గట్టి పునాది వేసేలా అంగన్వాడీల్లో మార్పు చేస్తున్నాం. రూపు మార్చుకున్న అంటరానితనం: ♦ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోంది, వారిలో మార్పు రావాలి. ♦వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్లస్ పథకాల ద్వారా దాదాపు 30.16 లక్షల అక్క చెల్లెమ్మలు, చిన్నారులకు లబ్ధి. ♦47,248 అంగన్వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి. ♦మొత్తంగా ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో పౌష్టికాహారం సరఫరా. ♦గత ప్రభుత్వం ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఖర్చుకు వెనకాడవద్దు: ♦రోజూ పెట్టే మెనూలో ఇంకా ఏమైనా మార్పులు తీసుకురండి. ఎక్కువ ఖర్చైయినా ఫరవాలేదు, తినడానికి ఆసక్తిగా ఉండాలి. ♦ప్రతి లబ్ధిదారునిపై గతంలో నెలకు కనీసం రూ.200 కూడా ఖర్చు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం రూ.1100 ఖర్చు చేస్తోంది. ♦కోవిడ్ సమయంలో ఆదాయాలు పడిపోయాయి. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి పోయింది. వాటన్నింటినీ తీరుస్తూ, అందరికీ మేలు చేయడం కోసం ఈ పథకాలు అమలు. ♦అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచాయి. అధికారం లోకి రాగానే తొలుత 77 మండలాల్లో ప్రయోగాత్మకంగా పథకం అమలు. దాని ఫలితాలు విశ్లేషించి ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు. రాబోయే రోజుల్లో.. ♦రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలలో ఇంకా అభివృద్ధి. ♦నాడు–నేడులో రూపురేఖలు మార్పు. ♦ఆ దిశలో కొత్తగా పీపీ–1, పీపీ–2లు ప్రారంభం, బాలలకు పౌష్టికాహారం. ♦పేదలు కూడా సగర్వంగా మంచి విద్యను పొందేలా ఈ కార్యక్రమం ద్వారా చేయగలుగుతామని నమ్మకం. -
‘సంపూర్ణ పోషణ’కు సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న ఆహార పదార్థాల మెనూపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. పదార్థాల రుచి చూశారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు. (చదవండి: జగన్ పాలనపై వంద శాతం సంతృప్తి) వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం.. 4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం.. ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
నేడే ‘పోషణ’కు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం.. 4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. – 36 నుంచి 72 నెలల లోపున్న 1.64 లక్షల మంది చిన్నారులకు నెలలో 25 రోజులపాటు వేడి అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు 200 మిల్లీ లీటర్ల పాలు, కోడిగుడ్డు, 50 గ్రాముల బాలామృతం లడ్డు ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.553 చొప్పున మొత్తం రూ.108.83 కోట్లు ఖర్చు కానుంది. – 6 నుంచి 36 నెలలలోపున్న 1.50 లక్షల మంది చిన్నారులకు టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడి గుడ్లు, 6 లీటర్ల పాలు అందించనున్నారు. ఒక్కొక్కరిపై నెలకు రూ.620 చొప్పున మొత్తం రూ.111.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం 3.80 లక్షల మంది లబ్ధిదారులపై రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం.. – ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. – 36 నుంచి 72 నెలల్లోపు ఉన్న 7.06 లక్షల మంది చిన్నారులకు నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున మొత్తం రూ.296.52 కోట్లు ఈ పథకంతో ఖర్చు చేస్తారు. – 6 నుంచి 36 నెలల లోపున్న 13.50 లక్షల మంది చిన్నారులకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున మొత్తం రూ.667.44 కోట్లు ఖర్చు చేయనున్నారు. – వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో మొత్తం 26.36 లక్షలమంది లబ్ధిదారులకోసం ప్రభుత్వం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రెండు పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.