సాక్షి, అమరావతి : ఏ రోజుకా రోజు వేడివేడి అన్నం.. ఆకుకూర, దోసకాయ, టొమాటో, బీరకాయలతో ఏదో ఒక పప్పు.. కూరగాయలతో సాంబారు, మునగాకు, పాలకూర.. తల్లులకు కోడిగుడ్డు కూర 200 మిల్లీలీటర్ల పాలు.. పిల్లలకు ఉడికించిన కోడిగుడ్డుతో పాటు 100 మిల్లీలీటర్ల పాలు.. ఇవికాక ప్రతి మంగళవారం పిల్లలకు పులిహోర, గురువారం తల్లులకు ఎగ్‌ఫ్రైడ్ రైస్, పిల్లలు, తల్లులకు ప్రతి శనివారం వెజిటబుల్ రైస్.. ఇదేదో ధనవంతులు ఇళ్లలో తినే ఆహారం కాదు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌లో అందిస్తున్న మెనూ. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ అట్టాడ సిరి ఇందుకు సంబంధించిన మెనూ ఛార్ట్‌ను గురువారం విడుదల చేశారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గోరుముద్ద తరహాలో బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలని నిర్ణయించి ఈ మెనూ ఛార్ట్‌ను రూపొందించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి ఇంటి వద్దకే పోషకాహార పంపిణీ అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో జూలై 1 నుంచి గర్భవతులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు ప్రీ స్కూల్ విద్యార్థులకు వేడివేడిగా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం దోహదం చేస్తుందని డాక్టర్ సిరి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 31,85,359 మంది, ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా 3,49,228 మంది చొప్పున మొత్తం 35,34,587 మంది లబ్ధిపొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment