‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’కు నీతి ఆయోగ్‌ ప్రశంస | Niti Aayog Praises YSR sampoorna poshana scheme Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’కు నీతి ఆయోగ్‌ ప్రశంస

Published Wed, Jul 6 2022 4:23 AM | Last Updated on Wed, Jul 6 2022 8:02 AM

Niti Aayog Praises YSR sampoorna poshana scheme Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణులు, పాలిచ్చే స్త్రీలు, ఆరు నుంచి 36 నెలల వయసున్న చిన్నారుల్లో పోషకాహార లోపాల్ని అధిగమించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. సమయానుకూలంగా పోషకాహార లక్ష్యాల్ని చేరుకోవడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన టేక్‌హోమ్‌ రేషన్‌ కార్యక్రమాల్లోని వినూత్న పద్ధతులను సంకలనం చేస్తూ నీతి ఆయోగ్‌ ఓ నివేదికను విడుదల చేసింది.

ఏటా రెండు శాతం పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన జాతీయ పోషకాహార మిషన్‌ (పోషణ్‌ అభియాన్‌) 2.0ను సమర్థంగా వినియోగించి టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రాల ఉదాహరణలు, నమూనాలతో ప్రేరణ పొందడానికి ఈ నివేదిక ఉపకరిస్తుందని పేర్కొంది. నిజానికి.. టేక్‌ హోమ్‌ రేషన్‌ ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండడంతోపాటు లబ్ధిదారుల పోషకాహార అవసరాలు తీర్చేలా ఉండాలి.

ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో బాలామృతం, పాలు, గుడ్లు అందించడాన్ని ఉత్తమ పద్ధతిగా అభివర్ణించింది. టీహెచ్‌ఆర్‌ మెనూలో లబ్ధిదారుల అదనపు ఎంపికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవకాశమిస్తున్నాయని తెలిపింది. ఇక టీహెచ్‌ఆర్‌లో కీలకాంశమైన పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాంకేతికతను అందిపుచ్చుకుందని తెలిపింది.

అలాగే, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి చేసిన స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ బహుళ విధాలుగా ఉపయోగపడుతోందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అంతేకాక.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణలో డేటా ఎంట్రీ, ప్రొసెసింగ్, వాలిడేషన్‌ తదితర అంశాలనూ నివేదికలో వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement