
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్పారు. మహిళలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే సీఎం జగన్ ధ్యేయమని తెలిపారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. టీడీపీ హయాంలో మహిళా శిశు సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక మహిళా శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 12,128 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 4,018 పోస్టులనే భర్తీ చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం లభించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు.
జూన్ నాటికి ఉద్ధానం ప్రాజెక్టు పూర్తి: మంత్రి రజిని
ఉద్ధానం ప్రాంతంలోని దాదాపు 8 లక్షల మందికి ప్రాణాధారమైన ఉద్ధానం మంచి నీటి ప్రాజెక్టు జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సమయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీడీపీ హయాంలో ఉద్ధానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధలు పడినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఆ ప్రాంత ప్రజల కష్టాలను కళ్లారా చూసిన సీఎం జగన్ దానిపై బాగా ఆలోచించి మూల కారణమైన మంచి నీటి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. 100 కి.మీ.దూరం నుంచి మంచి నీటిని తరలించేందుకు రూ.750కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ కిడ్నీ రోగుల వైద్యం కోసం 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు రీసెర్చి సెంటర్‌ను నిరి్మస్తున్నారని చెప్పారు.
జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు: మంత్రి జోగి రమేష్
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 21,25,778 ఇళ్లలో 4,40,756 ఇళ్లు పూర్తయి లబ్దిదారులు ఆనందంగా గృహప్రవేశాలు కూడా చేశారన్నారు.
ఈ పథకం కింద ఇప్పటికే రూ.42,973 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గ స్థాయిలో సమీక్షిస్తూ పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరిగేలా మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ఓటీఎస్ కింద డబ్బులు కట్టిన వారికి వెంటనే ఇళ్ల పత్రాలు అందిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకంగా ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న పేదలకు ఇళ్ల కోసం త్వరితంగా భూసేకరణ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment