budget planning
-
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
జీవితకాల పొదుపు మొత్తం కరోనా పట్టుకుపోయింది!
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట ఇది. పొదుపు, పెట్టుబడులు, వ్యయాల (ఇంటి బడ్జెట్) విషయంలో లోపాలను ఈ మహమ్మారి గుర్తు చేయడమే కాదు, వ్యక్తుల నడవడికను మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం తెలియజేసింది. ఆర్థిక విషయాల్లో వ్యక్తుల ఆలోచనా ధోరణిని మార్చడమే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఒక ప్రముఖ సంస్థ ఇదే అంశంపై ఆన్లైన్లో ఒక సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా ఎదురైన భిన్న అనుభవాలు, కష్ట సుఖాలు ఈ సర్వేలో పాలుపంచుకున్న 408 మంది వెల్లడించారు. ఆ వివరాలు ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’లో.. ఒకవైపు ఉద్యోగాల్లోంచి తొలగింపులు, వేతన కోతల కాలం.. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే వారికి మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ పెద్ద సవాళ్లే. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఉద్యోగం కోల్పోయినట్టు లేదా వేతన కట్‌ను ఎదుర్కొన్నట్టు చెప్పడం గమనార్హం. స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం 71 మందిలో 37 మంది ఇదే విధంగా చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో పావు వంతు మంది (సర్వేలో పాల్గొన్న వారిలో)తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ లేదా ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంత మందిపై ఆర్థిక భారం గణనీయంగా పడింది. చెన్నైకు చెందిన మృదుల (సర్వేలో పాల్గొన్న వ్యక్తి) పరిస్థితినే చూస్తే.. ఆమె స్వయం ఉపాధిలో ఉన్న మధ్య వయసు మహిళ. గతేడాది లాక్‌డౌన్‌తో ఆమె ఆదాయానికి బ్రేక్ పడింది. అదే సమయంలో మృదుల తల్లి (78) కరోనా వైరస్ బారిన పడ్డారు. 65 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కానీ, చికిత్స కోసం రూ.34 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘‘ఆరంభంలో రోజుకు రూ.40,000 బిల్లు వచ్చింది. వెంటిలేటర్ అవసరం ఏర్పడడంతో బిల్లు రూ.లక్షకు వెళ్లిపోయింది. వెంటిలేటర్ అవసరం తొలగిపోయిన తర్వాత అమ్మను ఇంటికి తీసుకొచ్చేశాము. ఎందుకంటే ఇక అంతకుమించి ఆస్పత్రి బిల్లు కట్టే పరిస్థితి లేదు’’ అని మృదుల తెలిపారు. మృదుల మాతృమూర్తి ఇప్పటికీ ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆక్సిజన్ ఇతర ఔషధాలు, పరీక్షల కోసం నెలవారీగా రూ.1–1.5 లక్షలు ఖర్చువుతోంది. ఇతర చిక్కులు/పరిమితులు..? ఆస్పత్రిలో చేరితే ఎదురయ్యే వైద్య ఖర్చుల భారం ఏ మేరకు ఉంటుందో ముందుగానే అంచనా వేయలేము. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న భరోసాతో ధైర్యంగా ఉండలేని పరిస్థితులను కరోనా పరిచయం చేసింది. కరోనా బారిన పడిన వారికి నగదు రహిత వైద్య చికిత్సలు అందించేందుకు మొదట్లో చాలా ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ఆస్పత్రుల వైఖరి అలాగే ఉంది. క్లెయిమ్‌లలో జాప్యం, అత్యవసరాలను గట్టెక్కేందుకు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. వినోదిని ఐటీ ఉద్యోగి. బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమెకు కంపెనీ తరఫున కార్పొరేట్ హెల్త్ కవరేజీ ఉంది. కరోనా పాజిటివ్‌గా తేలి ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. ఫోన్లో డాక్టర్‌ను సంప్రదించారు. తెలిసిన వారి సాయంతో ఔషధాలు తెప్పించుకున్నారు. ‘‘మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వైద్యుల ప్రిస్క్రిప్షన్, బిల్లు, టెస్ట్‌ల రిపోర్ట్లు సమర్పించాల్సి రావడం అన్నది అసహనానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు ఇటువంటి వాటి గురించి ఆలోచించలేరు. దీంతో కొన్ని వేల రూపాయలకు క్లెయిమ్‌ను నేను పొందలేకపోయాను’’ అని వినోదిని తెలిపారు. దీనికి బదులు టెస్టింగ్ రిపోర్ట్/స్కాన్ రిపోర్ట్ సమర్పించిన వెంటనే ఆటోమేటిక్‌గా నిర్ణీత మొత్తాన్ని రీయింబర్స్మెంట్ కింద అందించే విధంగా నిబంధనలను సడలించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా సీరియస్ పరిస్థితుల్లో రోగిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులతోనూ చాలా మంది నగదు రహిత క్లెయిమ్ అవకాశాన్ని కోల్పోయారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే నగదు రహిత చికిత్సలకు అవకాశం ఉంటుందని తెలిసిందే. రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు.. కానీ, అదేమంత సులభమైన ప్రక్రియ కాదు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, డిటెయిల్డ్ బిల్లు, అన్ని టెస్ట్ రిపోర్టులు, వైద్యుల ప్రిస్కిప్షన్ ఇలా అన్ని డాక్యుమెంట్లు, వాటిపై ఆస్పత్రుల సీల్, సంతకాలతో సేకరించి బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిల్లో కొన్ని లేకపోయినా మళ్లీ ఆస్పత్రి చుట్టూ తిరిగి వాటిని తీసుకుని సమర్పించాలి. ఇదంతా సమయం, శ్రమతో కూడుకున్న పనే. వైద్య బీమా కవరేజీ గణణీయంగానే ఉన్నప్పటికీ.. కొన్నింటికి ఉప పరిమితులు ఉంటాయి. దీంతో వాస్తవ బిల్లుతో పోలిస్తే తమకు అందిన మొత్తం తక్కువేనని సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు చెప్పారు. మృదుల తల్లిదండ్రులు కాంట్రిబ్యూటరీ హెల్త్సర్వీస్ స్కీమ్‌లో ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బీమా పథకం. అయితే, మృదుల తల్లి నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరడంతో.. వాస్తవంగా రూ.34 లక్షల బిల్లు వచ్చినప్పటికీ.. రీయింబర్స్మెంట్ రూపంలో కేవలం రూ.11లక్షలే అందుకున్నారు. ఇక పెట్టుబడుల విక్రయంలోనూ సమస్యలు ఎదుర్కొన్న వారూ ఉన్నారు. భాస్కర్ కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఈపీఎఫ్ నిధి నుంచి విత్‌డ్రాయల్‌కు దరఖాస్తు చేసుకోగా.. అందుకు 15 రోజులు పట్టింది. ఈపీఎఫ్ ఆన్లైన్లో క్లెయిమ్ సదుపాయం ఉన్నప్పటికీ.. యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోవడం, ఆధార్ లింక్ చేసుకోకపోవడం అప్డేట్ చేసుకోకపోవడం ఇలా వివిధ కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్ చెల్లింపులు ఆలస్యంగా అందుకున్న వారు చాలా మందే ఉన్నారు. గిరిధర్ పరిస్థితి మరింత భిన్నమైనది. ఆయనకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గతేడాది మూసేసిన ఆరు డెట్ పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆ పెట్టుబడులను సొమ్ము చేసుకోలేని అనుభవాన్ని చవిచూశారు. పొదుపు పట్ల మారుతున్న ధోరణి! కరోనా ‘పొదుపు’ పట్ల వ్యక్తుల ఆలోచన తీరునే మార్చేసింది. కొందరు జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని కరోనా మహమ్మారి పట్టుకుపోయిందని లబోదిబోమంటున్నారు. పొదుపు పట్ల తమ ఆలోచన మారిందని 65 శాతం మంది సర్వేలో చెప్పారు. కరోనాకు ముందుతో పోలిస్తే తాము మరింత మొత్తాన్ని పొదుపు చేస్తామని 30 శాతం మంది తెలిపారు. జీవిత, వైద్య బీమా కవరేజీని పెంచుకోవడంతోపాటు.. భవిష్యత్తు ఖర్చుల కోసం మరింతగా పెట్టుబడులు పెడతామని కొందరు చెప్పారు. ముఖ్యంగా అత్యవసర నిధి అవసరాన్ని చాలా మంది గుర్తించారు. కొందరు అయితే ఆరు నెలల అవసరాలకు కాకుండా.. కనీసం ఏడాది నుంచి రెండేళ్ల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి అయితేనే సముచితమన్న అభిప్రాయానికి వచ్చారు. రిస్క్ తీసుకోని వారు బ్యాంకు ఖాతాల్లో ఈ నిధిని ఉంచేస్తామని.. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో, స్వీప్ ఇన్ బ్యాంకు ఖాతా రూపంలో ఉంచుకుంటామని చెప్పారు. వయసులో చిన్న వారు అయితే రిస్క్ తీసుకుని అత్యవసర నిధిని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. కానీ, ఇలాంటి నిర్ణయాల విషయంలో తగినంత ముందస్తు అధ్యయనం, పర్యవేక్షణ అవసరం. కరోనా వేళ తమకు నిధుల అవసరం ఏర్పడినప్పుడు స్టాక్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుందామనుకుంటే.. నష్టాలు దర్శనమిచ్చాయని సర్వేలో కొందరు చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ అవసరాన్ని స్వయం ఉపాధుల్లో ఉన్న వారు గుర్తించారు. రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని చెబుతుంటారు. అయినా, పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకున్న వారికి కరోనా కాలం తగిన అనుభవాన్నే నేర్పింది. అప్పు అసలే వద్దు.. ‘‘అస్సలు అప్పుల్లో ఉండకూడదని, ఉన్నా చాలా పరిమిత రుణ భారానికే కట్టుబడాలని కొందరి అనుభవం చెబుతోంది. ‘‘నేను నా పెట్టుబడులను వెనక్కి తీసుకుని రుణాన్ని ముందుగానే తీర్చేశాను. వెంటనే రుణ రహితంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చిన్నారిపై అప్పులు తీర్చాల్సిన భారం పడకూడదు’’అని సర్వేలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు..? ఊహించని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు గట్టెక్కేందుకు అత్యవసర నిధి అంటూ ఒకటి కచ్చితంగా ప్రతీ ఇంటికి ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంటి బడ్జెట్లో దీనికి పెద్ద ప్రాధాన్యతే ఉంది. కానీ, ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరణలో పెట్టడం లేదని ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కేవలం 36.5 శాతం వద్దే అత్యవసర నిధి ఉంది. పైగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఖర్చులను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడం అన్నది అందరికీ సాధ్యపడని విషయం. అయినా, 75 శాతం మంది సాధ్యమైనంత వరకు ఖర్చులకు కోత విధించుకున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆరు నెలల అవసరాలు, ఖర్చులు, పెట్టుబడులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఉంచుకోవాలన్నది ఆర్థిక సూత్రం. అయితే, కరోనా వంటి విపత్తుల్లో ఆరు నెలల అవసరాలకు సరిపడే అత్యవసర నిధి ఏ మేరకు సరిపోతుందన్న ప్రశ్న? ఇప్పుడు కొత్తగా ఉదయించింది. ఎందుకంటే చెన్నైకు చెందిన మృదుల చాలా పద్ధతిగా, ప్రణాళిక మేరకు నడుచుకునే వారే. ఆమె, ఆమె తండ్రి కలసి అత్యవసర నిధి కింద కొన్ని రూ. లక్షలు సిద్ధంగా ఉంచుకున్నవారే. కానీ, ఆమె తల్లి కరోనాతో సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు వచ్చి పడింది. దీంతో మృదుల తన దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న డెట్ పెట్టుబడులను ఉపసంహరించుకుని ఆస్పత్రికి చెల్లించారు. ఆమె ఒక్కరే కాదు.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది తమ అత్యవసర వ్యయాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, పోస్టాఫీసు పొదుపులు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించారు. ‘‘ఆస్పత్రి నుంచి ఇంత చెల్లించాలంటూ డిమాండ్ రావచ్చని ముందే ఊహించా ను. దాంతో కొన్ని రోజుల ముందే పెట్టుబడులను విక్రయించడం వల్ల అవి నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. దాంతో చెల్లింపులు చేయగలిగాను’’ అని మృదుల వివరించారు. విజయ్‌ది భిన్నమైన అనుభవం. విశాఖపట్నంకు చెందిన ఆయన కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. అత్యవసర నిధి అంటూ ఆయనకు ఏదీ లేదు. దీంతో అత్యవసరాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేశారు. ‘‘మా నాన్న గారు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. స్టాక్స్‌లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. కానీ నాన్న శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. దీంతో సోమవారం కానీ స్టాక్స్‌ను విక్రయించలేను. విక్రయించిన మేర సొమ్ము నా బ్యాంకు ఖాతాకు రావడానికి బుధవారం వరకు వేచి ఉండాల్సిందే. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం ఒక్కటే నాకు సౌకర్యవంతమైన మార్గంగా అనిపించింది. కార్డు ద్వారా చెల్లించి ఆ తర్వాత నిధులు సర్దుబాటు చేసుకుందామని నిర్ణయానికొచ్చేశాను’’ అని విజయ్ తెలిపారు. కష్టకాలంలో ఇలా క్రెడిట్ కార్డులను వినియోగించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, క్రెడిట్ కార్డుపై లిమిట్‌ను వాడుకోవచ్చు కానీ.. గడువులోపు ఇతర మార్గాల్లో నిధులను సర్దుబాటు చేసుకుని తీర్చేయడం వల్లే ఉపయోగం ఉంటుంది. లేదంటే క్రెడిట్ కార్డు బకాయిలపై 3–4 రూపాయిల వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. ఇది మధ్యతరగతి ఇంటి బడ్జెట్‌ను మరింతగా తారుమారు చేసేయగలదు. కరోనా వల్ల ఎదురైన ఆర్థిక భారాన్ని ఎలా అధిగమించారు? వినియోగ సాధనం ఎంతమంది(%) అత్యవసర నిధి వినియోగం 36.5 క్రెడిట్ కార్డులతో చెల్లింపులు 18.6 అనధికారిక, వ్యక్తిగత, బంగారు, ఇతర రుణాలు 11.5 స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ విక్రయం 19.6 ఎఫ్డీలు, బాండ్ల ఉపసంహరణ 13.5 పోస్టాఫీసు పథకాల నుంచి ఉపసంహరణ 3.4 బీమా పాలసీల సరెండర్ 4.7 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ 6.1 ఖర్చులను తగ్గించేసుకున్నవారు 75.5 ఆరోగ్యం లేకుంటే డబ్బున్నా.. సున్నానే! ‘‘మీకు ఈ రోజు డబ్బులు ఉండొచ్చు. అయినా ఆరోగ్యాన్ని, ఆక్సిజన్‌ను కొనుక్కోలేని పరిస్థితి. భవిష్యత్తులో డబ్బు అన్నది ఏ మాత్రం హోదా కాబోదు. మంచి ఆరోగ్యం, చక్కని ఆహారంతోపాటు.. ఎన్ని చెట్లను నాటారు అన్నదే ముఖ్యమవుతుంది’’ సర్వేలో ఒక అభ్యర్థి చెప్పిన మాట ఇది. -
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో రూ. 1,552 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు. ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. -
భద్రతకు భారీగా కేటాయింపులు
పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది. జంట పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.186 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించింది. నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు కమిషనరేట్‌కు రూ.116 కోట్లు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.70 కోట్లు అందించింది. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రతీ ఏటా నగర పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించేది. ఈ సారి అలా కాకుండా ప్రణాళికా బడ్జెట్ కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన నగర పోలీసు ప్రధాన కార్యాలయ భారీ భవనానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో త్వరలో భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగనున్నాయి. ఇక ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు కూడా పెద్ద పీట వేశారు. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీసీటీవీ సర్వెలెన్స్ ప్రాజెక్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.69.59 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కూడా ఇందులో నిధులు కేటాయించారు. అలాగే, నేరాల అదుపు, కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించేందుకు టెక్నాలజీ అభివృద్దికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. భద్రతకు భారీగా నిధులు కేటాయించడంపై జంట జిల్లాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర కమిషనరేట్ కు.. రూ.20 కోట్లు: కొత్తగా నిర్మించనున్న కమిషనర్ ప్రధాన కార్యాలయం. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ రూ.20 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్ ఏర్పాటు రూ.44.59 కోట్లు: సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ రూ.21.41 కోట్లు- ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ రూ.10 కోట్లు-నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందు కు సరికొత్త టెక్నాలజీని సమకూర్చుకునేందుకు సైబరాబాద్ కమిషనరేట్‌కు... కేటాయించింది మొత్తం రూ.70 కోట్లు రూ.25 కోట్లు: సీసీ కెమెరాల ఏర్పాటు రూ.45 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో ఆధునిక రిసెప్షన్ సెంటర్లు, టాయిలెట్స్, బారికేడ్లు, గచ్చిబౌలిలోని కమిషనరేట్ భవనంపై అదన ంగా మరో అంతస్తు నిర్మాణం, కమాండ్ కంట్రో ల్ సెంటర్, ఆదిబట్ల, గచ్చిబౌలి, జవహర్‌నగర్, మహిళా పోలీసు స్టేషన్ లకు పక్కా భవనాలు. -
భద్రతకు భరోసా
* పోలీసుకు మొదటిసారిగా ప్రణాళికా బడ్జెట్ * జంట కమిషనరేట్లకు రూ. 186 కోట్లు కేటాయింపు * నగరానికి రూ. 116 కోట్లు,సెబరాబాద్కు రూ. 70 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది. జంట పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.186 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించింది. నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు కమిషనరేట్‌కు రూ.116 కోట్లు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.70 కోట్లు అందించింది. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రతీ ఏటా నగర పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించేది. ఈ సారి అలా కాకుండా ప్రణాళికా బడ్జెట్ కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశా రు. బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన నగర పోలీసు ప్రధాన కార్యాలయ భారీ భవనానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో త్వరలో భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగనున్నాయి. ఇక ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు కూడా పెద్ద పీట వేశారు. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీసీటీవీ సర్వెలెన్స్ ప్రాజెక్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.69.59 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కూడా ఇందులో నిధులు కేటాయించారు. అలాగే, నేరాల అదుపు, కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించేందుకు టెక్నాలజీ అభివృద్దికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. నగర కమిషనరేట్ కు.. * రూ.20 కోట్లు: కొత్తగా నిర్మించనున్న కమిషనర్ ప్రధాన కార్యాలయం. * కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ * రూ.20 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్ ఏర్పాటు * రూ.44.59 కోట్లు: సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ * రూ.21.41 కోట్లు: ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ * రూ.10 కోట్లు-నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందు కు సరికొత్త టెక్నాలజీని సమకూర్చుకునేందుకు సైబరాబాద్‌కు... * కేటాయించింది మొత్తం రూ.70 కోట్లు * రూ.25 కోట్లు: సీసీ కెమెరాల ఏర్పాటు * రూ.45 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో ఆధునిక రిసెప్షన్ సెంటర్లు, టాయిలెట్స్, బారికేడ్లు, * గచ్చిబౌలిలోని కమిషనరేట్ భవనంపై అదన ంగా మరో అంతస్తు నిర్మాణం, కమాండ్ కంట్రో ల్ సెంటర్, ఆదిబట్ల, గచ్చిబౌలి, జవహర్‌నగర్, మహిళా పోలీసు స్టేషన్ లకు పక్కా భవనాలు. శుభసూచకం... పీపుల్స్, పోలీసు, పీస్ (శాంతి), పొగ్రెస్ (అభివృద్ధి)కి ఈ బడ్జెట్ శుభసూచకం. సమాజంలో శాంతి లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు. దానికి అధిక ప్రధాన్యత నిస్తూ పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ విషయం. నేను ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన సమయంలో 11 వందల కోట్లు కేటాయించాం. దానితో పోలిస్తే విభజన అనంతరం తొలి బడ్జెట్లో తెలంగాణకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఇది భవిష్యత్‌లో ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఎంతగానే దోహదపడుతుంది. అభివృద్ధి శరవేగంగా సాగడానికి పోలీసు శాఖకు ఈ నిధులు సరిపోతాయి. పీపుల్స్, పోలీసు, పీస్, ప్రొగెస్ (4పి) అనే ఇంగ్లీష్ నానుడికి ఈ బడ్జెట్ ప్రేరణగా ఉంది. - పేర్వారం రాములు, మాజీ డీజీపీ ప్రతి పైసా ప్రజల కోసం ఉపయోగిస్తాం... ప్రభుత్వం కేటాయించిన రూ.186 కోట్ల నిధులలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు స్టేషన్లలో సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తాం. నేరాల అదుపుతోపాటు నేరాల మిస్టరీని త్వరగా ఛేదించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికను తయారు చేస్తున్నాం. పోలీసులకు కావల్సిన వాహనాలు ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. వారికి కావాల్సిన మరికొన్ని పరికరాలు, సౌకర్యాల కల్పిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ జంట పోలీసు కమిషనర్లు -
విహారానికీ బీమా..
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. హాయిగా ... సరదాగా చల్లని ప్రదేశాలకు అలా తిరిగి రావాలనుకునే వారు టూర్ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. విహారయాత్ర అంటేనే రోజువారీ టెన్షన్లూ.. గొడవలు లేకుండా జాలీగా గడిపేందుకు ఉద్దేశించినది. ఎలాంటి తలనొప్పులు లేకుండా సరదాగా సాగిపోవాలి. ఇందుకోసం ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం. ఎక్కడికెళ్లాలి, అక్కడ ఏమేం ఉంటాయి, ఎక్కడెక్కడ తిరగొచ్చు, ఏం చేయొచ్చు, ఏమేం తీసుకెళ్లాలి, ఎలా వెళ్లాలి లాంటి అనేక విషయాల గురించి బోలెడంత కసరత్తు చేస్తాం. బడ్జెట్ గట్రా లాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్న అంశాలు కాబట్టి మనం ఎంతైనా ప్లాన్ చేయొచ్చు. కానీ, మన చేతుల్లో లేని వాటి కారణంగా కూడా ఒకోసారి ప్లాన్ అంతా అప్సెట్ కావచ్చు. దొంగతనం జరిగినా.. ఆరోగ్యం దెబ్బతిన్నా... ఊరు గాని ఊరులో ఏం చేయాలో అర్థం కాదు. విహారయాత్రలనే కాకుండా తీర్థయాత్రలు, సాధారణ ప్రయాణాల్లో కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొన్నటి అమర్నాథ్ యాత్ర కావొచ్చు .. నిన్నటి మలేసియా విమాన దుర్ఘటనలాంటివి ఇందుకు నిదర్శనాలు. శుభమా అంటూ సరదాగా తిరిగొద్దామని బైల్దేరే ముందు ఇలాంటి సమస్యల గురించి ఆలోచించడానికి, కనీసం ప్రస్తావించుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. కానీ, విహారయాత్ర నిజంగానే క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలంటే.. ఎలాంటి సమస్య ఎదురైనా బైటపడ గలిగేట్లు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇందుకోసమే ప్రయాణ బీమా పాలసీలు ఉపయోగపడతాయి. కేవలం వందల రూపాయల ప్రీమియాలతో కొండంత భరోసానిస్తాయి ఈ పాలసీలు. సాధారణంగా.. ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు, వైద్యానికి వేరే చోటికి తరలింపు, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం, లగేజ్ పోగొట్టుకోవడం, దొంగతనాల బారిన పడటం, ఫ్లయిట్ జాప్యం, ఆర్థికంగా అత్యవసర పరిస్థితులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. అత్యవసర వైద్య ఖర్చులు.. ప్రయాణంలో అనారోగ్యం పాలైనా .. గాయాల పాలైనా చికిత్స ఖర్చులకు టావెల్ బీమా పనిచేస్తుంది. అవుట్పేషంట్గా ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా ఇన్‌పేషంట్‌గా చేరినా, పాలసీలో పేర్కొన్న పరీక్షలు చేయించుకున్నా బీమా కంపెనీయే ఖర్చులు చెల్లిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్న చోట్ల సరైన వైద్య సదుపాయాలు లేకపోతే.. వేరే దగ్గరికి తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చిక్కుబడిపోయినప్పుడు ఇలాంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు, కంపాషనేట్ విజిట్.. అంటే.. పాలసీదారు వారం రోజులపైగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వ చ్చినప్పుడు వారిని చూసుకునేందుకు వెళ్లే కుటుంబ సభ్యుల (ఒకరు) ప్రయాణ ఖర్చులను (రాను, పోను) కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఫ్లయిట్ జాప్యం.. కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల వల్ల ఫ్లయిట్ జాప్యం కావడం, ఫలితంగా మనం వేసుకున్న ప్లాన్ అంతా గందరగోళం అయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాలకు కూడా బీమా కవరేజీ వర్తిస్తుంది. విమానం బైల్దేరడంలో పన్నెండు గంటలకు మించి జాప్యం జరిగితే .. బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అలాగే చెక్డ్ ఇన్ బ్యాగేజ్ దొరక్కుండా పోయినా లేదా మన బ్యాగేజ్ మనకు అందుబాటులోకి రావడంలో తీవ్ర జాప్యం వల్ల మెడికేషన్కి, దుస్తులకు ఇబ్బందిపడినా ఆ మేరకు పరిహారం లభిస్తుంది. అంతే కాదు.. విమానం హైజాక్ అయినప్పుడు కూడా పాలసీ అక్కరకొస్తుంది. హైజాక్ ఎన్ని రోజులు కొనసాగితే అన్ని నాళ్లకు రోజుకు ఇంత చొప్పున అలవెన్స్ ఇస్తుంది బీమా కంపెనీ. ఆర్థిక అత్యవసర పరిస్థితి .. ముందే చెప్పుకున్నట్లు ఊరు గాని ఊరులో పర్సునెవరైనా కొట్టేస్తే డబ్బుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో పాలసీల్లో పేర్కొన్న పరిమితికి లోబడి బీమా కంపెనీ అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఒకవేళ ఊహించని విధంగా మన తప్పిదం వల్ల ఇతరులెవరైనా గాయపడినా, మరణించినా.. ఆస్తులు ధ్వంసమైనా కూడా థర్డ్ పార్టీకి పరిహారం కూడా చెల్లిస్తుంది. ప్రీమియంలు.. కంపెనీలు.. అత్యంత తక్కువ ప్రీమియంలకే అత్యధిక స్థాయిలో కవరేజీ ఇస్తున్నాయి బీమా కంపెనీలు. కొన్ని సంస్థలు ఆన్లైన్లో దేశీ ప్రయాణాలకు రూ. 173 నుంచి రూ. 865 స్థాయిలో పాలసీలు అందిస్తున్నాయి. మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇవి రూ. 20,000 నుంచి రూ. 1 లక్ష దాకా కవరేజీ కల్పిస్తున్నాయి. టాటా ఏఐజీ, నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర సంస్థలు ఈ తరహా పాలసీలు అందిస్తున్నాయి. షరా.. పాలసీ తీసుకునే ముందు ఒకసారి వివిధ సంస్థలవి పోల్చి చూసుకోవాలి. తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ ఏది ఇస్తోందో తెలుసుకోవాలి. అలాగే, ఏయే అంశాలకు కూడా కవరేజీ వర్తిస్తుంది, వేటికి మినహాయింపులు ఉన్నాయన్నది కూడా తెలుసుకోవాలి. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. జర్నీ హ్యాపీనే.. దేశీ ప్రయాణాల్లో బీమా కవరేజీలు ఇలా..