ఈటల సమర్పించిన జలదృశ్యం | etala ragender produces budjet 2016-17 in telangana assembly | Sakshi
Sakshi News home page

ఈటల సమర్పించిన జలదృశ్యం

Published Tue, Mar 15 2016 3:21 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

ఈటల సమర్పించిన జలదృశ్యం - Sakshi

ఈటల సమర్పించిన జలదృశ్యం

 

- రూ. 1,30,415 కోట్లతో బడ్జెట్

- సాగునీటి ప్రాజెక్టులకే రూ. 25 వేల కోట్ల కేటాయింపు

- పాలమూరు, కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. - - - - మిషన్ కాకతీయకు రూ. 2 వేల కోట్లు

- సంక్షేమం, వైద్యారోగ్యానికి  ఘనంగా కేటాయింపులు

- ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ’లకు రూ. 13,355 కోట్లు

- బడ్జెటేతర వనరుల ద్వారా ‘భగీరథ’, డబుల్ బెడ్‌రూం ఇళ్లు

- నాబార్డు, హడ్కో, బ్యాంకుల నుంచి రుణ సమీకరణ

- ముఖ్యమంత్రి వద్ద రూ. 4,675 కోట్లతో ప్రత్యేక నిధి

 

సాక్షి, హైదరాబాద్

నీళ్లు.. నిధులు.. నియామకాలు.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చోదకశక్తులివి! పోరాటానికి ఊపిరిలూదిన నినాదాలవి! వాటిలో మొదటిదైన ‘నీళ్లకు’ సర్కారు నిధుల వరద పారించింది!! పడావుపడ్డ భూములకు పచ్చదనం అద్దేందుకు ప్రాజెక్టులకు పట్టంకట్టింది. మూడో బడ్జెట్‌లో తెలంగాణ జల దృశ్యాన్ని ఆవిష్కరించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే మహా సంకల్పానికి అడుగు ముందుకేసింది.

 

తొలి రెండేళ్ల సంక్షేమ ఎజెండాను కొనసాగిస్తూనే 2016-17 బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. రూ.1.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సింహభాగం ఈ రంగానికే కేటాయించింది. ప్రణాళిక వ్యయాన్ని భారీగా పెంచి కార్యాచరణ దిశగా దృఢ సంకల్పాన్ని చాటుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌లో ఏకంగా రూ.25 వేల కోట్లను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టు, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకే రూ.15 వేల కోట్లు ప్రతిపాదించింది.

 

సాగునీటి వాటాను సమతుల్యం చేసేందుకు మిగతా రంగాలకూ సముచిత కేటాయింపులు చేసింది. గతేడాది సాగునీటి రంగానికి కేవలం రూ.8,500 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఈసారి అమాంతం మూడింతల నిధులు కేటాయించడం విశేషం. చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించనుంది. సాగునీటి కేటాయింపుల వాటాలోనే దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా చెరువుల పునరుద్ధరణకు ఖర్చు చేయనుంది.

 

భగీరథ, డబుల్ పథకాలకు బడ్జెటేతర నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా బడ్జెటేతర వనరులతో వీటిని చేపడతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన ప్రసంగంలో ప్రకటించారు. రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, కెనరా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే మంజూరు చేసిన 60 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు ఈ ఏడాది పట్టణాల్లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్లను హడ్కో రుణ సాయంతో నిర్మిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో అధునాతనంగా నిర్మించే నాలుగు కొత్త ఆసుపత్రులకు నెదర్లాండ్స్‌లోని రాబో బ్యాంకు సాయం తీసుకుంటామని తెలిపారు.

సంక్షేమానికి సముచిత ప్రాధాన్యం

ప్రణాళికా వ్యయానికి సంబంధించిన కేటాయింపుల్లో సాగునీటి రంగం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది. వీటికి రూ.13,355 కోట్లు ప్రణాళిక వ్యయంలో చూపించింది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి రూ.6,564.96 కోట్లు, రోడ్లు, రవాణా రంగానికి రూ.4,711 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.2,462.83 కోట్లు ప్రణాళిక పద్దు కింద కేటాయించింది. పట్టణాలు, నగరాభివృద్ధికి రూ.2,141.75 కోట్లు, వ్యవసాయానికి రూ.2,111.11 కోట్లు, విద్యారంగానికి రూ.1,780.44 కోట్లు కేటాయించింది. నిరుటితో పోలిస్తే గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి, విద్యుత్ రంగానికి, తాగునీటి సరఫరాకు నిధుల వాటా తగ్గించింది.

 

ఈసారి కొత్త పథకాలివే..

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద బడ్జెట్‌లో రూ.4,675 కోట్లు కేటాయించడం గమనార్హం. అనుకోని అవసరాలకు కేటాయించేందుకు వీలుగా వీటిని ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ల దగ్గర అందుబాటులో ఉంచుతారు. బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలతో సహా అన్ని వర్గాల్లోని పేద కుటుంబాలకు విస్తరించటం, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులకు సన్న బియ్యం.. ఈసారి బడ్జెట్‌లో కొత్త పథకాలు! ఆసరా ఫించన్లకు ఈ ఏడాది కూడా రూ.4,693 కోట్లు కేటాయించారు. రైతుల రుణమాఫీ పథకానికి మూడో విడత చెల్లింపులకు రూ.4,250 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.4,470 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,200 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు.

 

పోలీసుశాఖకు రూ. 4,817 కోట్లు

- ప్రణాళిక పద్దుల కింద గతేడాదికన్నా ఆరురెట్లు అధిక నిధులు

- కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ. 140 కోట్ల కేటాయింపులు

- పోలీసు సిబ్బంది క్వార్టర్లకు రూ. 70 కోట్లు

- నక్సల్స్, ఉగ్రవాదుల కట్టడికి రూ. 28 కోట్లు

పోలీసుశాఖపై రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనిస్తుందనే ఉద్దేశంతో పోలీసుశాఖ అడిగిన వాటికి కాదనకుండా కేటాయింపులు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద రూ. 4,817 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రణాళిక వ్యయం కింద కేవలం రూ. 200 కోట్లే కేటాయించగా ఈ ఏడాది ఆరు రెట్లు అధికంగా రూ. 1,200 కోట్లు కేటాయించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 3,504.70 కోట్లు ఖర్చు కావడంతో ఈ ఏడాది రూ. 3,617 కోట్లు కేటాయించింది.

 

కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు భారీ కేటాయింపు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీటీ)కు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సీసీటీ టవర్ల నిర్మాణానికి దాదాపు రూ. 140 కోట్లు కేటాయించింది. అలాగే పోలీసు సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.70 కోట్లు, సీసీటీవీల పర్యవేక్షణ కోసం రూ. 225 కోట్లు, జిల్లాల్లోని పోలీసుస్టేషన్‌లలో రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 80 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది కమిషనరేట్‌గా రూపాంతరం చెందిన వరంగల్ సీపీ ఆధునీకరణకు రూ. 25 కోట్లు కేటాయించగా పోలీసు అకాడమీకి రూ.32 కోట్లు కేటాయించింది.

 

అగ్నిమాపకశాఖకు 223 కోట్లు...

ఏళ్లుగా నిరాదరణ కు గురవుతున్న అగ్నిమాపకశాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేలా ప్రణాళిక పద్దుల కింద రూ. 111 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ ప్రణాళిక పద్దుల కింద కేవలం రూ. 41 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి దాదాపు మూడు రెట్లు పెంచింది. రాష్ట్రంలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేకపోవడంతో తక్షణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 64 కోట్లు కేటాయించింది.

 

తక్షణ చర్యలకు ప్రత్యేక నిధులు...

ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు పోలీసుశాఖ తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా బడ్జెట్‌లో పోలీసు సూపరింటెండెంట్, నగర పోలీసు కమిషనర్‌ల కు రూ. కోటి చొప్పున నిధులు కేటాయించింది. రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ పరిధిలో రూ. 10 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. ఆకస్మిక పరిస్థితుల నిర్వహణ కు పోలీసు విభాగానికి రూ. 20 కోట్లు కేటాయించారు. నక్సల్స్, ఉగ్రవాదుల క ట్టడి కోసం దాదాపు రూ. 28 కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ రహదారి భ ద్రతను ఇక నుంచి పోలీసులే పర్యవేక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పీడ్‌గన్స్, నూ తన పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. పెట్రోలింగ్ వాహనాలకు రూ. 23 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement